Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పాడుచేయొద్దు
- రూల్స్ పాటించకపోతే వెయ్యి ఫైన్, జైలు శిక్ష
- గల్లీ లీడర్లకు మెట్రో ఎండీ వార్నింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్ పిల్లర్లపై అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హెచ్చరించారు. స్విద మొబిలిటీ ప్రయివేటు సంస్థ పది లక్షల రైడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం బేగంపేటలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ మెట్రో రైల్‌తో స్విద మొబిలిటీ సంస్థ మరోసారి ఎంవోయూ కుదుర్చుకున్నది. ఈ కార్యక్రమంలో ఎల్అండ్టీ మెట్రో రైల్ సీఎండీ కేవీబీ రెడ్డి, స్విద డైరెక్టర్-కో ఫౌండర్ జగేష్ పి.బెల్లానితో పాటు మెట్రో, స్విద ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ... మెట్రో పిల్లర్లపై రాజకీయ నాయకుల పోస్టర్లు వేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటివరకు నోటీసుల వరకే సరిపెట్టామని, ఇకపై ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అవసర మైతే సెంట్రల్ మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటెన్స్ యాక్ట్ అమలు చేస్తామని, పోస్టర్ వేస్తే రూ.వెయ్యి జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్షకు గురవుతారని హెచ్చరించారు. ముఖ్యంగా గల్లీ లీడర్లు ఈ పోస్టర్లు ఎక్కువగా వేస్తున్నారని, ఇతర రాష్ట్రాల మాదిరిగా మెట్రో పిల్లర్లపై అడ్డగోలుగా పోస్టర్లు అంటించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పాడుచేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వీరులు, చరిత్ర గురించి పెయింటింగ్స్ పెడితే వాటిపై పోస్టర్లు వేయడం సరికాదన్నారు. కాలుష్యం కారణంగా పట్టణాల్లో నివసించే వారి ఆయుష్షు నాలుగేండ్లు తగ్గిపోతుందని, కాలుష్యం లేని ప్రయాణం కోసం మెట్రో రైళ్లు ఉపయోగపడుతున్నాయని గుర్తుచేశారు.
వన్ మిలియన్ రైడ్స్ పూర్తి చేసుకున్న స్విద
మెట్రో ప్రయాణికులను చివరి స్టేషన్ నుంచి వారి గమ్యస్థానాలకు చేరవేతలో పది లక్షల రైడ్స్ (వన్ మిలియన్ రైడ్స్) ను స్విద మొబిలిటీ సంస్థ పూర్తిచేసుకుందని తెలిపారు. మొదటి, చివరి గమ్యస్థానాలను స్వీద తమ సర్వీసులను కవర్ చేస్తుందనీ, కరోనా సమయంలో నష్టపోయిన ఇచ్చిన హామీ మేరకు వారు వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. కోవిడ్‌కు ముందు స్వీద రోజుకు 8వేల మందికిపైగా సేవలందిస్తూ..25 మెట్రో స్టేషన్ల నుంచి 47 రూట్లలో 121 షటిల్ సర్వీసులు నడిపేదని, ఇప్పుడు అయిదు రూట్లలో ఆపరేట్ చేస్తూ.. 3వేల మంది ప్రయాణికులను చేరవేస్తుందని వివరించారు. టికెట్ టారిఫ్ రూ.25 నుంచి ప్రారంభ మవుతుందనీ, భవిష్యత్తులో ఈ వెహికల్స్ ప్రవేశపెట్టాలనీ, రాబోయే 12 నెలల్లో రోజుకు 12వేల మంది ప్రయాణికులు చేరుకునేలా వారు బస్సులను పెంచాలన్నారు. ముఖ్యంగా సెక్రటేరియట్, ఎన్ఎండీసీ, స్కూల్స్, మాల్స్, రెసిడెన్షియల్, హైకోర్టు, సిటీ సివిల్‌కోర్టు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్షిప్లకు స్వీద తమ సేవలను విస్తరించాలని కోరారు. ఎల్అండ్టీ మెట్రో రైల్ సీఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ వన్ మిలియర్ రైడ్స్ పూర్తిచేసుకున్న సందర్భం గా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ మైల్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివీటిలో భాగంగా ఇతర మార్గాలలోనూ స్వీద తమ సేవలను పెంచాలని ఆయన కోరారు.
క్రికెట్ అభిమానులకు శభవార్త
క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో రైల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈనెల 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపుగా 10గంటలు దాటనుంది. ఈ సమయంలోనూ క్రికెట్ ఫ్యాన్స్ నిశ్చింతగా, సురక్షితంగా ఇండ్లకు వెళ్లేందుకు ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. క్రికెట్ ఫ్యాన్స్ రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచే విషయంపై కూడా దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు.