Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఆలోచన, ఆచరణకి సంబంధించినదే అసలైన వ్యక్తిత్వమని వ్యక్తిత్వ వికాస నైపుణ్యాల ట్రైనర్ ఒమాజీ అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాల ఆర్థిక శాస్త్ర విభాగం, ఐక్యూఏసీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో 'వ్యక్తిత్వ వికాసం, మంచి వక్తగా మారడం ఎలా' అంశాలపై గురువారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వ్యక్తిత్వం అంటే శరీరానికి సంబంధించినది కాదని, వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలకు, వాటి ఆచరణకు సంబంధించినదన్నారు. ఈఅనంత విశ్వంలో ప్రతివ్యక్తి ప్రత్యేకమైన వారేనని, తమ ప్రత్యేకతను గుర్తించి పెద్దలు, గురువులు అందించే సూచనలతో వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవాలని సూచించారు. కేవలం డిగ్రీ పట్టాలతో గుర్తింపు లభించదని, తమలో నిద్రాణంగా ఉన్న శక్తిని గుర్తించి దానికి తగిన సాధన చేసి ఉన్నతిని సాధించాలని అన్నారు. సమయ నిర్వహణ, క్రమశిక్షణ, ప్రణాళికా రచన వంటివి విజయానికి సోపానాలని, అవి యుక్త వయసులో అనుసరిస్తే వ్యక్తిగతంగానూ, కుటుంబానికి, తద్వారా సమాజానికి, దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించవచ్చని అన్నారు. నలుగురిలో మాట్లాడటానికి భయపడుతున్నామంటే మనకి విషయంపైన అవగాహన లేకపోవటం కానీ, మనపై మనకి నమ్మకం లేకపోవటం కానీ కారణాలుగా గుర్తించాలని అన్నారు. మాట్లాడవలసిన విషయం గురించి తగిన సమాచారం గ్రహించి, నలుగురికీ ఎలా అందించాలో తెలుసుకుంటే నమ్మకం ఏర్పడుతుందని, అప్పుడు వక్తలుగా రాణించటం సాధ్యమవుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.బాల భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం తరగతి పుస్తకాలకు మాత్రమే పరిమితం కాక ఇలాంటి కార్యశాలల్లో పాల్గొనటం ద్వారా జీవన నైపుణ్యాలను తెలుసుకుంటారని, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మన తరం హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సంస్థ అభినరు, అధ్యాపకులు డాక్టర్.ఎస్.పి.కష్ణ వేణి, డాక్టర్.జె.నీరజ, విద్యార్థులు పాల్గొన్నారు.