Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
స్వరాష్ట్రంలో తెలంగాణ సినీ కళాకారులకు ప్రోత్సాహం లభిస్తున్నదని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న బతుకమ్మ ఫిల్మోత్సవం (2022)కు సంబంధించిన పోస్టర్‌ను రవీంద్రభారతిలో మంత్రి విడుదలచేశారు.
ఈ సందర్భంగా మంత్రి డా. వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సినీ కళాకారులను ప్రోత్సహించడంకోసం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌ను ఏర్పాటుచేసి సినిమారం గానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మని, ఆయా కార్యక్రమాల ద్వారా ఔత్సాహిక కళాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ సినిమా రంగంలో రాణిస్తున్నారని అన్నారు. పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా ఇప్పటివరకు 10మంది కొత్త దర్శకులను తెలుగు సినిమారంగానికి పరిచయం చేశామని, మరికొంతమంది సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ దర్శకులు, నటీనటులు, నిర్మాతలు తీసిన కొత్త సినిమాలతో బతుకమ్మ ఫిల్మోత్సవం (2022)లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 5.00 గంటలకు చిత్ర ప్రదర్శన ప్రారంభమవుతుందని, ప్రదర్శన తరువాత ప్రేక్షకులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో ఆయా చిత్ర దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారని యంగ్ ఫిలిం మేకర్స్ మరియు సినీప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన అంశాల గురించి తెలుసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.