Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 107వ జయంతి వేడుకల్లో బాపూజీని కొనియాడిన వక్తలు
- జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, పోలీస్ కమిషనరేట్లలో ఘనంగాజయంతి
- వేడుకలు, ప్రముఖుల నివాళి
కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయినందున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బాపూజీ చిత్ర పటాలకు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో, కాలనీల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల విగ్రహ ఆవిష్కరణలు చేశారు.
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, ఆయన నడిచిన బాట నేటి తరానికి, రేపటి తరానికి ఆదర్శనీయం అనిజీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్ అన్నారు. మంగళవారం 107వ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొండాలక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికోసం బాపూజీ ఎనలేని సేవ చేశారని, అంతేకాకుండా తెలంగాణ సాధన కోసం తనదైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారి ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, జయరాజ్కెన్నడీ, యాదగిరిరావు, చీఫ్ అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వరరెడ్డి, సెక్రెటరీ లక్ష్మి, ఓఎస్డీ అనురాధ, సీపీఆర్ఓ మొహమ్మద్ మూర్తుజా, పీఆర్ఓ జీవన్, రమణ, అంబర్పేట్ ఏఎంహెచ్ఓ జ్యోతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వాటర్‌బోర్డు కార్యాలయంలో...
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుక ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాటర్‌బోర్డు ఎం.డి. దానకిశోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, తెలంగాణ సాధనకు కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాంతం కషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడుతోపాటు పబ్లిక్సెల్ అధికారి చారీ, పీఆర్వో సుబాష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఎప్పటికీ గుర్తుండిపోతారు
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి దిక్సూచి లాంటి వారని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ అన్నారు. నాటి క్విట్ ఇండియా మూవ్మెంట్ మొదలుకొని ప్రత్యేక తెలంగాణ సాధన వరకు ఉద్యమాలలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ భాగస్వామ్యం ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. మంగళవారం నెరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్రోద్యమం సహా అనేక పోరాటాలు చేశారని తెలిపారు. 1941లో గాంధీజీని కలిసిన ప్రేరణతో 1942లో జరిగిన క్విట్ ఇండియా మూవ్మెంట్ మొదలు కొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు బాపూజీ పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. రాజాకార్లకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణా సాయుధ పోరులో ఆయన పాత్ర కీలకమన్నారు. 1952 లో ముల్కి నిబంధనలను వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమంతో పాటు 1969లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలి ఉద్యమం నుంచి మొదలు కేసీఆర్ ప్రారంభించిన మలిదశ ఉద్యమం వరకు ఆయన పాత్ర ఆమోఘమైనదని తెలిపారు. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన బాపూజీ విశేష పాత్ర పోషించారన్నారు. న్యాయవాదిగా అణగారిన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పాటుపడ్డారన్నారు.
కలెక్టరేట్లో
కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర సాధనకు చేసిన సేవలు అనిర్వచనీయమని అదనపు కలెక్టర్ వెంకటేశ్వరు అన్నారు.కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ వాదులపై ఆనాడు పెట్టిన కేసులను సైకిల్ మీద భువనగిరి వెళ్లి వాళ్ల తరఫున ఉచితంగా వాదించి వచ్చే వారని.. ఇది ఆయన మహౌన్నత వ్యక్తిత్వానికి నిదర్శమని అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తించిన ప్రభుత్వం వారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సూర్యలత, డిప్యూటీ కలెక్టర్లు సంగీత, శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.