Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్,
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
- దోమలగూడలో భగత్‌సింగ్ విగ్రహానికి నివాళి
నవతెలంగాణ-సిటీబ్యూరో
యువత భగత్‌సింగ్ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని డీవైఎఫ్ఐ పిలుపునిచ్చింది. మంగళవారం భగత్‌సింగ్ 115వ జయంతి సందర్భంగా దోమలగూడలోని భగత్‌సింగ్ విగ్రహానికి డీవైఎఫ్ఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా, పరాయి పాలన నుంచి విముక్తి కోసం, భారతదేశపు స్వాతంత్య్రం కోసం 23 ఏండ్లకే ఉరికంబాన్ని ముద్దాడిన గొప్ప విప్లవ పోరాట యోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరి దీనికి అనుబంధంగా భారత నవజవాన్ సభ స్థాపించి దేశంలోని యువకుల్లో జాతీయత, విప్లవ భావాలు, దేశభక్తిని పెంపొందించారనీ, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి చరిత్రను నేడు బీజేపీ ప్రభుత్వం కర్నాటకలో పాఠ్యపుస్తకాల భగత్‌సింగ్ చరిత్రను తొలగించడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా యువత భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి నిజమైన దేశభక్తి, జాతీయత భావాలు ఉంటే భగత్ సింగ్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలనీ, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా భగత్‌సింగ్ జయంతి, వర్ధంతి సభలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాఠ్యా పుస్తకాలలో భగత్ సింగ్ జీవిత చరిత్రను చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జావేద్, నాయకులు రఘు, పవన్, శ్రీమాన్, రాజు, నరేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.