Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
- జె. రుద్రకుమార్
నవతెలంగాణ-తుర్కయాంజల్
ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు, డ్రైవర్లకు వెంటనే ప్రమాద బీమాను వర్తింపజేయాలని రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జె.రుద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తుర్కయంజాల్లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా రెండవ మహాసభ ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రుద్రకుమార్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డి కిషన్ హాజరై మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యంతోపాటు, ప్రతి ట్రాన్స్పోర్ట్ అడ్డాకు యూనియన్ రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీస్ వేధింపులను అరికట్టాలని, విపరీతమైన చలాన్లు రద్దు చేయాలన్నారు. 2019 మోటార్ వెహికల్ వాహన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రవాణారంగాన్ని ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలన్నారు.. రవాణా కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వారి పిల్లలకు ఉచిత విద్య, సబ్సిడీతో కూడిన నూతన వాహనాలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కె. రాములు, ప్రధాన కార్యదర్శిగా జె.రుద్ర కుమార్, ఉపాధ్యక్షులుగా ఆలేటి ఎల్లయ్య, జి రాజు, ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్, కుమార్ గౌడ్, నాగేష్ గౌడ్, గుండా బాలరాజ్, సహాయ కార్యదర్శిగా కె.సత్యనారాయణ, మహ్మద్ బలాల్, ధర్మారెడ్డి. బీరప్ప, వెంకటేష్ గౌడ్ లతో పాటు మరో 17 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పి మధు, కె.సత్యం డి.ప్రేమాజీ, ఎల్లయ్య, భాస్కర్, డ్రైవర్లు నందీశ్వర్, శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, మధుకర్ రెడ్డి, బీరప్ప, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.