Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మెన్ మణికొండ వేదకుమార్
- 1908లో మూసీ వరదల్లో మరణించిన వారికి నివాళి
- 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం
నవతెలంగాణ-ధూల్‌పేట్/అంబర్‌పేట
1908లో సెప్టెంబర్ 28వ తేదీన సంభవించిన వినాశకరమైన మూసీ మహా వరదలకు 115 ఏండ్లు పూర్తి అయ్యాయని, ఇది హైదరాబాద్ చరిత్రలో ఒక ఘోర విపత్తుగా మిగిలిపోయిందని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మెన్ మణికొండ వేదకుమార్ అన్నారు. ఈ విషాదానికి పర్యవసానంగా నాటి పాలకులు నిపుణులైన ప్రణాళికాకర్తల సహాయంతో పటిష్టమైన వివిధ నగర అభివృద్ధి ప్రణాళికలను, పథకాలను అమలు చేశారని తెలిపారు. ఈ దుర్ఘటన ఆధునిక నగర ప్రణాళికకు ఉదాహరణగా నిలిచిందన్నారు. 150 మందిని కాపాడిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆవరణలోని చింతచెట్టు కింద 'సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్', 'దక్కన్ హెరిటేజ్ అకాడమీ, బేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్, ఇతర సివిల్ సొసైటీ గ్రూపుల భాగస్వామ్యంతో ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మెన్ మణికొండ వేదకుమార్ అధ్యక్షతన స్మారక సమావేశం నిర్వహించారు. ఆ ఘటన మృతులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1908లో వచ్చిన మూసీ వరదల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, కొందరు ఈ చింతచెట్టుపైకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. ఏడవ నిజాం ఉస్మాన్ అలీ సూచనలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిర్మించారని చెప్పారు. ఈ రెండు జలశాయాలు నగరానికి వరద ముప్పును తప్పించడమే కాకుండా మంచినీటి, సాగునీటి వసతులు కల్పిస్తున్నాయన్నారు. ఆనంద్ రాజ్ వర్మ మాట్లాడుతూ గతంలో పర్యాటకులు, వర్తకులు నగరానికి వచ్చినప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో విడిది చేసి, ఆ నీటిని మంచినీరుగా తాగేవారని చెప్పారు. ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ మాట్లాడుతూ కులమతాలు, ధనిక, బీదలకతీతంగా ఈ చింతచెట్టు 150 మంది ప్రాణాలను కాపాడిందని, ఇదే స్ఫూర్తితో యువతరం కూడా మంచి మానవ సంబంధాలను కలిగి సంఘానికి ఉపయోగపడేలా మసులుకోవాలన్నారు. వినోద్ యాదవ్ బారా దర్వాజా బారా కిడ్కీల మ్యాప్‌ను ప్రజెంట్ చేసి వాటి విశిష్టతను వివరించారు. సమాజానికి చెట్ల సేవపై ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు పాడిన పాట, రామ్ నువాన్ పరాశర్ పాడిన లావిని పాట, ఆంజోన్ దేఖా హాల్ ఆఫ్ ఫ్లడ్స్‌లో చింత చెట్టు పాట ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ ఐవస్ అభిషేక్, జి. వేణుగోపాల్, వీరేష్ బాబు, ఎస్ఆర్డీ ప్రతినిధి శివరాణి, పి.నరహరి, సుభాష్ రెడ్డి, మొహమ్మద్ తురాబ్, ఎస్ఐ వి.రాంబాబు, అఫ్టల్, లత తదితరులు పాల్గొన్నారు.