Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి
- ఘనంగా భగత్‌సింగ్ జయంతి వేడుకలు
- ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
భారత బానిస సంకెళ్లు తెంచడం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ ధ్రువతార భగత్ సింగ్ అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో సమాజంలో ఉన్న అసమానతలపై, విద్యా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న పాలకులపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 115వ జయంతి వేడుకలను హిమాయత్‌నగర్‌లోని డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి, 115 తెలుపు-ఎరుపు బెలూన్లను గాలిలో ఎగరవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు రావి శివరామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.అశోక్ స్టాలిన్ ప్రారంభించారు. తదనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తూ ఉరికంబాన్ని ముద్దాడి అమరత్వం పొందిన విప్లవ ధ్రువతార భగత్ సింగ్ అని కొనియాడారు. ఆయన పోరాట పటిమకు బ్రిటిష్ ముష్కరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవని, అందుకనే వారిని అర్థాంతరంగా ఉరితీయాల్సిన దినపరిస్థితి బ్రిటిషర్లకు ఏర్పడిందన్నారు. భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో నేటి సమాజంలో అసమానతలపై, విద్యను అంగడి సరకుగా, కాషాయికరణ చేసే నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా, ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో నెలకొన్న విద్య, నిరుద్యోగ, ప్రజా సమస్యలపై ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు.
భగత్‌సింగ్ చరిత్ర సమాజానికి తెలియాలి
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌సింగ్ పాత్ర ఎంతో కీలకమైందో మనందరికీ విధితమేనని, అంతటి మహోన్నతనమైన వ్యక్తి చరిత్రను యావత్తు సమాజానికి తెలియకుండా పాలక వర్గాలు కుట్ర చేస్తున్నాయన్నారు. భగత్‌సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా లిఖించడంతో పాటు ఆయన జయంతి (సెప్టెంబర్ 28), వర్ధంతి (మార్చి 23)లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాని డిమాండ్ చేశారు. భగత్‌సింగ్‌కి భారతరత్న ఇవ్వాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా భగత్‌సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం భగత్‌సింగ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రెహమాన్, కాసోజు నాగజ్యోతి, నెల్లి సత్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శివ, అన్వర్, పవన్ చౌహాన్, క్రాంతి రాజ్, హరికృష్ణ, చైతన్య యాదవ్, నాయకులు హరీష్, విజరు, శ్రావణ్, శివనంద్, సాయి, శశి, మహేష్, సంతోష్, జవద్, నవీన్, శ్రీహరి, అంజి తదితరులు పాల్గొన్నారు.
నారాయణగూడ చౌరస్తాలో భారీ ర్యాలీ
స్వాతంత్య్ర ఉద్యమకారుడు భగత్ సింగ్ స్ఫూర్తితో అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు షాహిద్ భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం నారాయణగూడ చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత శక్తివంతమైన, ప్రఖ్యాతిగాంచిన ఉద్యమకారుడు భగత్ సింగ్ అని కొనియాడారు. 23 ఏండ్ల వయస్సులోనే అనేక విషయాలపై అధ్యయనం చేసి భవిష్యత్తు భారతం కోసం అనేక పుస్తకాలను రాసిన గొప్ప మేధావి అని గుర్తు చేశారు. కార్మికులు, నిరుపేదలు, మహిళల సమానత్వం కోసం పోరాటాలు చేశారని, ఆచరణలో సైతం నిరూపించిన వ్యక్తి భగత్ సింగ్ అని చెప్పారు. దేశం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన భగత్ సింగ్ జీవిత చరిత్రను నేటి యువతకు అందించాల్సిన ప్రభుత్వాలు అమలు చేసే విషయంలో అత్యంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆయన కలలుగన్న సమాజ నిర్మాణం కోసం పోరాడాల్సిన బాధ్యత నేటి విద్యార్థులపై ఉందని, ఆ దిశగా తమ పోరాటాలు ఉండాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గోలి హరికృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చైతన్య యాదవ్, నాయకులు వినోద్, నవీన్, శ్వేత, సౌమ్య, శిరీష, ఉజ్వల తదితరులు పాల్గొన్నారు.