Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనజీవన ప్రయాణంలో కొన్ని చిన్న చిన్న మార్పులతో ప్రాణాంతక మైన హృద్రోగాన్ని దూరంచేసుకోవచ్చు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజలకు వైద్యరంగ నిపుణులంతా ఇదే సూచిస్తున్నారు' అని కేర్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్టు అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వారు గుండె ఆరోగ్యానికి సంబంధించిన అనే అంశాలను వివరించారు.
నవతెలంగాణ, బంజారాహిల్స్
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో అత్యధికంగా హృద్రోగాలు, గుండెపోటు కారణంగానే ఉంటున్నాయి. ప్రతి యేటా దాదాపు 17.1 మిలియన్ల మరణాలకు ఇవి కారణమవు తున్నాయి. గత 40సంవత్సరాలుగా కార్డియోవాస్కులర్ వ్యాధికారక మరణాలు మన దేశంలో పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) అంచనాల ప్రకారం 2020 నాటికే ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మంది కార్డియాక్ పేషెంట్స్ (హృద్రోగులు) భారతీయులే ఉన్నారు.
ఈ కార్డియోవాస్కులర్ వ్యాధి వ్యక్తి పనితీరు, ఆర్థిక స్థోమతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక అంచనా ప్రకారం 2005 నుండి 2022 మధ్యకాలంలో 237 బిలియన్ల డాలర్లు (రూ.11850కోట్లు)ను భారతీయులు కార్డియో వాస్కులర్ కారణంగా నష్టపోయారు. ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే సందర్భంగా (జaతీసఱశీఙaరషబశ్రీaతీ నవaశ్ర్‌ీష్ట్ర టశీతీ జుఙవతీyశీఅవ) అనే థీమ్‌ను ఎంచుకున్నారు. ఇది గుండెపోటు, హృద్రోగాల నివారణకు రక్షణ అందించేందుకు ప్రజలను ప్రోత్సహిస్తోంది. దానికి అనుగుణంగా ఈ థీమ్‌కు కేర్ ఆస్పత్రి మద్దతు పలుకుతోంది. కార్డియాలజీ విభాగం తరఫున పలు సూచనలు చేస్తున్నాం. వాటిలో ముఖ్యమైనవి...
- రక్తంలో గ్లూకోజు స్థాయులు తెలుకోవాలి. ఇది ఉండాల్సిన స్థాయికంటే ఎక్కువగా ఉండటాన్ని మధుమేహం అంటారు. మధుమేహ బాధితుల్లో 60 శాతం మరణాలకు గుండెజబ్బులే కారణం అవుతున్నాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు దానిని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే మిగతావాళ్లు కూడా దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడూ రక్తపరీక్ష చేయించుకోవాలి. రక్తంలో గ్లూకోజు స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయేమో, తమకు మధుమేహం వచ్చిందేమో తెలుసుకోవటం ఈరోజుల్లో చాలా అవసరం.
రక్తపోటు చూసుకోండి
అధిక రక్తపోటు (హైబీబీ) అనేది గుండెపోటు, గుండెజబ్బులకు కారణం అవుతోంది. వాస్తవానికి ఎవరికైనా బీపీ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నా పైకి ఎటువంటి లక్షణాలు, సమస్యలు, బాధలు కనబడవు. దీనివల్ల చాలామంది తమకు హైబీపీ ఉందన్న సంగతి సరైన సమయంలో గుర్తించడంలేదు. కానీ లోపల్లోపల దానివల్ల జరిగే నష్టం జరిగిపోతూనే ఉంటోంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటుంటారు.
కొలెస్ట్రాల్ బీఎంఐ చూసుకోండి
చాలామంది గుర్తించటం లేదు కానీ, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండటం కూడాపెద్ద ముప్పే. దీనివల్ల రక్తనాళాలు పూడ్చుకుపోవడం అనే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా గుండెలో రక్తనాళాలు మూసుకుపోయి, రక్త సరఫరాకు ఆటంకం కలిగి గుండెపోటు వస్తుంది. మెదడులోని రక్తనాళాల్లో పూడికలు వచ్చి.. పక్షవాతం వంటి సమస్యలూ ముంచుకురావొచ్చు. ఇవేకాదు కొలెస్ట్రాల్ ఎక్కువుండటంవల్ల ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
గుండెకు బలాన్నివ్వండి
మనం తినే ప్రతిదీ మనకూ, మన గుండెకూ శక్తినిచ్చేదే. అయితే మనం ఒక్కశక్తినే చూసుకోకూడదు. మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఆహారాన్ని తినటం, అలాంటి వాటినే ఎంచుకోవటం చాలా ముఖ్యం అనేది గుర్తుంచుకోండి.
గుండెను బాధించకండి
మన గుండె ఒక యంత్రంలా క్షణం తీరిక లేకుండా పనిచేస్తూనే ఉంటుంది. దానికి ఇబ్బందులు తెచ్చిపెట్టే పనులు చెయవద్దు.
గుండెకు పని చెప్పండి
నిత్యం శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల చురుకుగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. గుండె జబ్బుల ముప్పు తగ్గిపో తుంది. జీవితం కూడా రోజంతా ఉల్లాసంగా గడు స్తుంది.
గుండె జబ్బు నివారణకు ముందస్తు జాగ్రత్తలు
చిన్న వయసులోనే గుండె పోటుకు గురైన వారసత్వ చరిత్ర ఉన్నవారు ఎప్పటి కప్పుడు కొలెస్ట్రాల్ పరీక్ష లు చేయించుకుంటూ కొలెస్ట్రాల్‌ను నియంత్రిం చుకోవాలి. కొలెస్ట్రాల్ పెరగడం అన్నది ఆ వ్యక్తి లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నడా అన్నది ముఖ్యంకాదు. లావుగా ఉన్నవారిలో కొలెస్ట్రాల్ నార్మల్‌గానే ఉండవచ్చు. సన్నగా ఉన్నవారిలో చాలా ఎక్కువగానూ ఉండవచ్చన్నారు. కాబట్టి కొలెస్ట్రాల్ శాతాన్ని లావు, సన్నను బట్టి అంచనా వేయకుండా టెస్టు చేయించుకుంటే తెలుస్తుంది. మెడికల్ టెస్టులో తేలాల్సిందే తప్ప శరీర బరువు ఆధారంగా మాత్రం కాదు. కాకపోతే లావుగా ఉన్నవారిలో కాస్త ఎక్కువ మందిలో ఈ సమస్య ఉండవచ్చు. కుటుంబ చరిత్ర ఉన్నవారు చిన్న వయసు నుంచే కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్త పడాలి. తీవ్రతను అనుసరించి ఆహార నియమాలు పాటించ డంగాని, మందులు వేసుకోవడంగాని డాక్టర్ల సూచన మేరకు చేయాలి. దీనివల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచవచ్చు. అలాగే గుండెపోటు రావడానికి మధుమేహం ఒకప్రధాన కారణం. అందుకే ఈ సమస్య ఉన్నవారు వ్యాధిని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ మందులు క్రమం తప్పకుండా వాడుతూ కనీసం మూడు నెలలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండటంవల్ల ఈ సమస్య నుంచి బయటపడటం సులువవుతుంది.
- డాక్టర్ వినోద్, కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్