Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- అధికారులతో బతుకమ్మ ఘాటు పరిశీలన
నవతెలంగాణ-బేగంపేట్
తెలంగాణ పల్లెల్లో పుట్టిన బతుకమ్మ పండుగను నేడు దేశ, విదేశాల్లోనూ నిర్వహిస్తున్నారనీ, ఇది మనకెంతో గర్వకారణం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నెక్లెస్ రోడ్డులోని కర్బలా మైదానంలో గల బతుకమ్మ ఘాట్‌ను వివిధ శాఖల అధికారులతో సందర్శించి అక్టోబర్ 3వ తేదీన సద్దుల బతుకమ్మ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకల సందర్భంగా రెండు స్టేజీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, బతుకమ్మ ఆడే ప్రాంతంలో లైట్లను ఏర్పాటు చేయాలనీ, బతుకమ్మ పాటలతో సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళలు ఇబ్బందులు పడకుండా ఈరోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అక్కడికి వచ్చే వారికి వాటర్, అల్పాహారం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ తెలంగాణ సంస్కతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ప్రతి ఏడాదీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు బతుకమ్మ ఆడాలంటే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్తితి ఉండేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పేద, మధ్య తరగతి మహిళలు కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాదీ రూ.340 కోట్లతో కోటీ 18 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, వసంత, నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ముకుంద రెడ్డి, వాటర్ వర్క్స్ రమణారెడ్డి, లింగేశ్వర్, భాస్కర్, హఫీజుద్దీన్, రవీంద్ర, మోహన్, తదితరులు ఉన్నారు.