Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు
- ఘనంగా భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ-ఓయూ/అంబర్‌పేట
జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్‌కు ఎదురు లేదు అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపనతో విద్యార్థులు ఓయూలో సంబురాలు జరుపుకున్నారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి, దేశప్రజల సమున్నత వికాసానికి కేసీఆర్ నడుం బిగించారని కొనియాడారు. దేశరాజకీయాల్లో సైతం ఆయన విజయ పరంపర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఒకవైపు దేశవ్యాప్తంగా రైతులకు అన్యాయం జరుగుతుంటే, మరోవైపు కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల దుస్థితి చూసి చలించిపోయిన కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేసి, చావు నోట్లో తలపెట్టి అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేశారని గుర్తు చేశారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపి బంగారు తెలంగాణకు బాటలు వేశారని కీర్తించారు. దేశంలో రాజకీయ రంగంలో నెలకొన్ని అనిశ్చితి, అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను చూసి ఉద్యమ నేత చలించిపోయారని చెప్పారు. అందుకే దేశాన్ని ముందుకు నడిపించేందుకు, అన్ని వర్గాలు, ప్రాంతాలకు సమాన న్యాయం కల్పించేందుకు ముందుకు వచ్చారని వివరించారు. ఇలాంటి తరుణంలో ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణ ప్రజలు ఒక్కటిగా నిలిచి మన మహానేతకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ఉత్తర భారతదేశం నుంచి జాతీయ పార్టీలుగా ఆవిర్భవించిన బీజేపీ, కాంగ్రెస్‌లు దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఆరోపించారు. దక్షిణ భారత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అభివృద్ధిని ఆణగదొక్కుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశం నుంచి జాతీయ పార్టీ లేకపోవడం వల్లనే ఇటువంటి పరిణామాలు జరిగి, 75 ఏండ్లలో ఈ ద్రవిడ ప్రాంతాలు అన్యాయానికి గురయ్యాయని వాపోయారు. మొట్టమొదటిసారి కేసీఆర్ దక్షిణ భారతదేశ బిడ్డగా ఒక జాతీయ పార్టీ నిర్మించతలపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉత్తర భారత పార్టీల అండతో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దక్షిణ భారతంలో వ్యాపారాలను కబ్జా చేస్తున్నారని దుయ్యబట్టారు. వారు ఇక్కడ రాజకీయాల్ని ప్రభావితం చేస్తూ, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. దక్షిణ భారత ద్రవిడ సంస్కృతిని నాశనం చేసేందుకు వారు కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, శ్రీకాంత్, క్రాంతి, సంపత్, ప్రశాంత్, శ్రీనివాస్, రాజేష్, నరేష్ పాల్గొన్నారు.
భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల్లో కాచిగూడ ఇన్చార్జి డాక్టర్ శిరీష యాదవ్, సీనియర్ నాయకులు నాగేందర్ దాత్రిక్ బాబ్జి, డివిజన్ అధ్యక్షులు బిష్మ దేవ్, ప్రధాన కార్యదర్శి సదానందు తదితర నాయకులు పాల్గొన్నారు.
భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను బాగ్ అంబర్‌పేట డివిజన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్ర్రమంలో డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్, సీనియర్ నాయకులు డాక్టర్ సులోచన, రమేష్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.