Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముక్రమ్ జాహ్ ట్రస్టీలు నవాబ్ ఫైజల్ ఖాన్, ఖలీల్ అహ్మద్
నవతెలంగాణ-ధూల్‌పేట్
పురానీ హవేలీ ప్రాంగణంలో ఉన్న చోటా మహల్‌ను పునర్నిర్మించి విద్యాభివృద్ధికి వినియోగిస్తామని ముక్రమ్ జాహ్ ట్రస్టీలు నవాబ్ ఫైజల్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ప్రిన్సిపల్ రేఖా వాగ్రే అన్నారు. పురానీ హవేలీలోని (మస్రత్ మహల్)లో ఎనిమిదవ నిజామ్ నవాబ్ మీర్ బర్కత్ అలీ 89వ పుట్టిన రోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురానీ హవేలీలోని ఖాళీ ప్రదేశాన్ని క్రీడాభివృద్ధికి వాడుకలోకి తీసుకువస్తామన్నారు. బాలికలకు క్రీడల్లో తగిన తర్ఫీదునిస్తామని ప్రకటించారు. పురానీ హవేలి ఆరు మహళ్లతో ఉందని, నవాబ్ ముక్రమ్ జా బహదూర్ విద్యాభివృద్ధికోసం వాటిని అప్పగించారని, ముక్రమ్ జాహ్ స్కూలు ఉత్తమ విద్యా ప్రమాణాలతో వెలుగొందుతుందని అన్నారు. క్రమశిక్షణ, ఉత్తమ ఫలితాలతో దూసుకెళుతోందని అన్నారు. విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కోవిడ్‌లో మృతిచెందిన తమ వారికి నివాళి అర్పించారు. విద్యార్థులు సమస్యలపట్ల ఆందోళన చెందకుండా పరిష్కారాలు వెతకాలని, నిత్యం సంతోషంగా ఉండాలని సూచించారు. ట్రస్టీ ఖలీల్ అహ్మద్ గురువుల గొప్పతనాన్ని వివరించారు. ప్రిన్సిపల్ రేఖా వాగ్రా స్కూలు రిపోర్టును నివేదించారు. మౌలానా ముహమ్మద్ హిలాల్ ప్రిన్స్ ముక్రమ్ జా ఆరోగ్యం కోసం ప్రార్థన చేశారు. విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయుల గురించి గొప్పగా చెప్పారు. విద్యార్థిని రేహానా స్వయంగా రాసిన గేయాన్ని పాడి వినిపించారు. విద్యార్థులు షుగుఫ్తా ఫాతిమా, సయ్యద్ తాహా, ఆగాజ్ హుసైన్, హామెద్ అలీ ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. బోర్డు ఎగ్జామ్స్‌లో ఫలితాలు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమొంటోలు అందించారు. మంచి ఫలితాలను సాధించిపెట్టిన టీచర్లను అభినందించారు. ముక్రమ్ జాహ్ స్కూలులో 3వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 200కిపైగా టీచర్లున్నారు. నూటికి నూరు శాతం ఫలితాల సాధనలో ముక్రమ్ జాహ్ ముందు వరుసలో ఉంటోందన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.