Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ వేద కుమార్ మణికొండ
నవతెలంగాణ-అంబర్పేట
నౌబత్బహాడ్ చారిత్రక, భౌగోళిక వైవిధ్యమైన ప్రాంతమని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ వేద కుమార్ మణికొండ అన్నారు. డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ఇంటర్నేషనల్ జియోడైవర్సిటీ డే-2022 సందర్భంగా యునెస్కో సైట్ భీంబెట్కా రాక్ షెల్టర్స్ల ప్రాముఖ్యతపై ప్రచురితమైన డెక్కన్ ల్యాండ్ అక్టోబర్ 2022 సంచికను గురువారం నౌబత్ పహాడ్ దగ్గర విడుదల చేశారు. ఈ సందర్భంగా బిర్లా ప్లానిటోరియం, మ్యూజియం నుంచి నౌబత్ పహాడ్ హైదరాబాద్ మీదుగా జియో హెరిటేజ్ వాక్-2022ను నిర్వహించారు. కార్యక్రమంలో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వేద కుమార్ మణికొండ, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోడైవర్సిటీ ఎక్స్ఫర్ట్ చకిలం వేణుగోపాలరావు హాజరై మాట్లాడుతూ దక్కన్ ప్రాంతం పురాతన కాలం నుంచి నేటి వరకు గొప్ప భూ వనరులతో సుసంపన్నమైన భౌగోళిక వనరులు, భౌగోళిక శిలలు, కొండలు, ఖనిజాలు, శిలాజాలు, భూస్వరూపాలు, నేల, జలశాస్త్ర లక్షణాల సహజ శ్రేణి (వైవిధ్యం) (జియోడైవర్సిటీ) కలిగి ఉందని తెలిపారు. తెలంగాణలో సుసంపన్నమైన భౌగోళిక వారసత్వ, భౌగోళిక వారసత్వ సంపద కలిగిన కీసరగుట్ట, రాచకొండ, గాంధారి కోట, ఉండ్రుగొండ, ఫణిగిరి ఉన్నాయని వెల్లడించారు. నౌబత్ పహాడ్ ఒక చారిత్రక, భౌగోళిక వైవిధ్యత ఉన్న స్థలమని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలిపారు. శిలలు, కొండలు, నీటి వనరులు భౌగోళిక వైవిధ్యతకు గణనీయంగా దోహదం చేస్తాయని చెప్పారు. జీవవైవిధ్యం, పర్యావరణ వ్వవస్థ సేవలను నిలుపుకోవడానికి ప్రాథమికమైనవని చెప్పారు. ప్రపంచంలోనే పురాతనమైన శిలలు హైదరాబాద్లో ఉన్నాయని, దక్కన్ పీఠభూమిలోని ఈ గ్రానైట్ శిలలు 2,500 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని అన్నారు. వీటిని సహజ వారసత్వంగా పౌర సమాజంచే రక్షించబడుతున్నవని తెలిపారు. తెలంగాణలో అనేక వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని జిల్లాల వారీగా లిస్టింగ్ చేసి, వాటిని జియోహెరిటేజీ సైట్లుగా నోటిఫై చేయడానికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని అన్నారు. డెక్కన్ హెరిటేజ్ అకాడమీ పర్యావరణ రక్షణలో భాగంగా భౌగోళిక వైవిధ్యత, భౌగోళిక వారసత్వాన్ని ఎల్లప్పుడూ రక్షించడానికి ముందంజలో ఉంటుందన్నారు. అనంతరం చకిలం వేణుగోపాలరావు మాట్లాడుతూ తెలంగాణ శిలాజాలు, అవశేష కొండల నిధి అని వాటిని వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాల కోసం దేశంతో పాటు దక్క న్ ప్రాంతం భౌగోళిక వైవిధ్యాన్ని, భౌగోళిక వారసత్వాన్ని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.