Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం
- ఇబ్బంది పడ్డ నగరవాసులు
- మరో రెండ్రోజుల పాటు వర్షాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం రాత్రి నుంచి అర్థరాత్రి వరకు పడిన వర్షానికి జనంలో పండుగ జోష్ కనిపించకుండా పోయింది. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు పడిన వానతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆయా ప్రాంతాల్లో నివసించే జనం అవస్థలు పడ్డారు. చాలాచోట్ల డ్రయినేజీ లీక్ అయి ఇబ్బందులకు గురయ్యారు. కాగా రాత్రి కురిసిన వాన నుంచి తెరుకోకముందే గురువారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగర జనజీవనం స్తంభించిపోయింది. నగర రోడ్లు చెరువులను తలపించాయి. మరోవైపు ఉపరితల అవర్తన ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడుతాయనీ, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందనీ, ప్రజలు తగు జాగత్త్రలు తీసుకోవాలని సూచించింది. కాగా గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్స్ కనిపించాయి. ముఖ్యంగా పంజాగుట్ట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉండింది. రాత్రి 8గంటల వరకు కాప్రాలో అత్యధికంగా 67.6 మి.మీ వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్‌లో 61.3 మి.మీ, రాజేంద్రనగర్‌లో 47.9 మి.మీ, ఉప్పల్‌లో 45.0 మి.మీ, తిరుమలగిరిలో 36.9 మి.మీ, సైదాబాద్‌లో 36.6 మి.మీ, మల్కాజిగిరిలో 35.8 మి.మీ, చార్మినార్‌లో 35.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పటాన్‌చెరువులో 2.0మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.