Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
నవతెలంగాణ-కల్చరల్
'కలం'ను ఆయుధంగా, 'గళం'ను ప్రజా చైతన్యంగా ఉద్యమించిన సుద్దాల హనుమంతు ప్రజా చైతన్య వాగ్గేయకారుడు అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. ఒక చేత్తో పెన్ను, మరొచేత్తో గన్నుపట్టి ఉద్యమబాటతో, మాట, ఆట, పాటలతో నాటి సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రజలమనిషి 'హనుమంతు' అని కొనియాడారు. ఎందరో మహానుభావులు కార్యక్రమంలో భాగంగా శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదికపై సుద్దాల హనుమంతు జయంతి సమావేశం గురువారం జరిగింది. డాక్టర్ కృష్ణమోహన రావు హాజరై మాట్లాడుతూ వెట్టిచాకిరి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు హనుమంతు అన్నారు. ఆయన రాసిన 'పాలబుగ్గల జీతగాడ... పసులగాసె మొనగాడ...' గీతం వెట్టి చాకిరిపై యుద్ధాన్ని ప్రకటించిందన్నారు. సుద్దాల హనుమంతు బాల్యం నుంచి భూస్వాముల, రజాకార్ల అమానుష దమనకాండలను వ్యతిరేకిస్తూ ఎదురొడ్డే తత్వాన్ని అలవర్చుకొన్నారన్నారు. అంతకుముందు సుద్దాల హనుమంతు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటించారు. గానసభ అధ్యక్షుడు కళా. జనార్దన మూర్తి, జాయింట్ సెక్రటరీ తాళ్ళపల్లి చక్రపాణి, జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుదిబండ వెంకట్ రెడ్డి, మిమిక్రి కళాకారులు మళ్లం రమేష్ పాల్గొన్నారు.