Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 65 శాతం కన్నా తక్కువ హాజరు ఉన్న విద్యార్థులకు పరీక్ష హాల్లోకి అనుమతి నిరాకరణ
- ప్రిన్సిపాల్‌తో తల్లిదండ్రుల, విద్యార్థుల వాగ్వాదం
- సొమ్మసిల్లి పడిపోయిన మాతృమూర్తి
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం టెక్నాలజీ కళాశాలలో గురువారం తీవ్రమైన ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కళాశాలలో ప్రస్తుతానికి 2వ, 4వ సెమిస్టర్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. యూజీసీ, ఓయూ నిబంధనల ప్రకారం 65% కన్నా తక్కువ హాజరు ఉన్న విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింత.సాయిలు పరీక్షల హాల్లోకి అనుమతించలేదు. దీనితో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు, ప్రిన్సిపాల్‌లో వాగ్వాదానికి దిగారు. హాజరు సాకుతో విద్యార్థుల జీవితాలు అంధకారంలో నెట్టవద్దు అని, నిబంధనల పేరుతో అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా వారిని పరీక్షలకు అనుమతించాలని మొరపెట్టుకున్నారు. ఈక్రమంలో ప్రిన్సిపాల్ చాంబర్లోనే ఒక తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే విద్యార్థులు ఆమెను హెల్త్ సెంటర్‌కి తరలించి అక్కడి నుంచి దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కాగా ఓయూ అధికారుల నుంచి అనుమతి తీసుకుంటాం అని కోరడంతో చివరకు గత్యంతరం లేక ప్రిన్సిపాల్ సదరు విద్యార్థులను కూడా పరీక్షలకు అనుమతించారు.
హాజరు శాతం లేకనే అనుమతించలేదు: ప్రిన్సిపల్
యూజీసీ, ఓయూ నిబంధనల ప్రకారం 65% హాజరు లేని విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించలేదని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత.సాయిలు తెలిపారు. గురువారం ఇలా హాజరు శాతం లేకుండా రాసిన విద్యార్థుల పరీక్ష పత్రాలు చెల్లవు అని చెప్పారు. తాము నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక యూనివర్సిటీ అధికారులు కూడా 75% హాజరు ఉంటే పరీక్షలకు అనుమతించాలని సూచించారు.