Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పికెట్ నాలా బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ముంపు నివారణకు ఎస్ఎన్డీపీ ద్వారా చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎస్ఎన్డీపీ ద్వారా రసూల్‌పుర వద్ద పికెట్ నాలాపై రూ.10కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జిని శుక్రవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నగర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దేశంలో ప్రధాన నగరాలు, మెట్రోపాలిటి ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, నగరాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందినట్లు మంత్రి తెలిపారు. గతేడాది, 2020లో కురిసిన భారీ, అతి భారీ వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ముంపు ఏర్పడి అనేక ప్రాంతాలలోని కుటుంబాలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తిరిగి పునరావృతం కాకుండా ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీ రాష్ట్ర మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేసినట్టు మంత్రి వివరించారు.
ముషీరాబాద్, అంబర్పేట్ ప్రాంతాల్లో కూడా పనులను పూర్తి చేయాలని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్షేత్రస్థాయిలో పర్యటించి వేగవంతం చేయుటకు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. మినిస్టర్ రోడ్డులో నాలా పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు పోలీస్, జోనల్ కమిషనర్, ఎస్ఈ స్థాయిలో నిర్ణయం తీసుకుని వారం రోజుల్లో పనులను చేపట్టాలని అన్నారు. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు, అర్ఓబీలు నిర్మాణాలు చేపట్టినట్లు మంత్రి అన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఎస్ఎన్డీపీి ద్వారా పనులను ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయని, కొన్ని పనులు 80 శాతం వరకు పూర్తయిన నేపథ్యంలో ఆ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. అన్ని పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సీఈ కిషన్, ఎస్ఈ భాస్కర్‌రెడ్డి, బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.