Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్తదానంపై అపోహలు వద్దు
- సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీస్ అమరవీరుల త్యాగాలను వెలకట్టలేనివని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 'మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్', 'ఫ్రీ డెంటల్ చెకప్ క్యాంప్'ను నిర్వహించారు. ఈ క్యాంప్‌ను జాయింట్ సీపీ అవినాష్ మహంతితో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరులైన పోలీస్ అమరవీరులకు జోహార్లు ఆర్పిస్తూ, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ తరుపున ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేనివని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. తలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్ కేన్సర్ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారికి అత్యధికంగా రక్తం అవసరం ఉంటుందని సీపీ వివరించారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దన్నారు. సైబరాబాద్ పోలీసులు, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, సెంట్రల్ బ్లడ్ బ్యాంక్, నీలోఫర్ చిల్డ్రన్ ఆస్పత్రి, ఎం అండ్ జే కాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదేవిధంగా పోలీసు సిబ్బంది కోసం పాణినీయ డెంటల్ ఆస్పత్రి వారి సౌజన్యంతో ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్యాంప్‌లో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్ ఉల్ హక్, ఆర్ఐలు తదితర పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. ఈ క్యాంప్‌లో పాల్గొన్న వారికి సీపీ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్డబ్ల్యీ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీలు, సిటిసి డాక్టర్ సుకుమార్, డాక్టర్ సరిత, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి డాక్టర్లు జాన్, డాక్టర్ సరిత, సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ శ్రవణ్, నీలోఫర్ చిల్డ్రన్ ఆస్పత్రి డాక్టర్ కిరణ్మై, కాన్సర్ ఆసుపత్రి సుహాసిని, పాణినీయ డెంటల్ డాక్టర్ ముసాదక్, డాక్టర్ జోసెఫ్, ఆర్ఐలు పాల్గొన్నారు.