Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బషీర్‌బాగ్ చౌరస్తాలో నిజాం కాలేజీ విద్యార్థుల రాస్తారోకో
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
నిజాం కాలేజీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్లో వెంటనే ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బషీర్‌బాగ్ చౌరస్తాలో వందలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. అనంతరం విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్థులు సౌందర్య, స్వప్న, విధిత, పవిత్ర, ప్రియా మాట్లాడుతూ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అమ్మాయిల కోసం హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని గతంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ ప్రకారం హాస్టల్ భవనం నిర్మాణం జరిగిందన్నారు. ఈ హాస్టల్ భవనంలో డిగ్రీ విద్యార్థులకు మాత్రమే వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు మరో భవనం నిర్మించి ఇవ్వాలని కోరారు. హాస్టల్ వసతి కోసం వందలాది మంది డిగ్రీ చదువుకునే అమ్మాయిలు ఎదురు చూస్తున్నారని, బయట వేలాది రూపాయలు చెల్లించి వసతి సౌకర్యం పొందే స్థితిలో విద్యార్థులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డిగ్రీ విద్యార్థినిలకు హాస్టల్లో ప్రవేశం కల్పించాలని కోరారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదని ఆరోపించారు.