Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
- ఆదిలోనే ఎందుకు నిలువరించలేదంటూ ఆగ్రహం
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు చేపట్టిన కూల్చివేతలు గురువారం రెండో రోజు కొనసాగింది. హెచ్ఎండీఏ, కార్పొరేషన్ నగర ప్రణాళిక అధికారుల జాయింట్‌గా కూల్చివేతలు చేపట్టారు. బుధవారం బోడుప్పల్ లోని చిలుక నగర్ రూట్లో కూల్చివేతలు చేపట్టిన అధికారులు గురువారం నాడు కూడా పాతవాటినే మరలా కూల్చివేశారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్, బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో అనుమతిలేని నిర్మాణాలను కూల్చివేశారు.
- కూల్చివేతలలో ఉద్రిక్తత
బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో కూల్చివేతలు చేపట్టిన అధికారులకు ప్రజాప్రతినిధులు, పలువురు రాజకీయ పార్టీల నాయకుల నుండి వ్యతిరేకత ఎదురైంది. 2016 సంవత్సరంలో గ్రామపంచాయతీగా ఉన్న బోడుప్పల్ మున్సిపల్‌గా ఏర్పాటు చేసిన సందర్భంగా అప్పటి కమిషనర్ ఉపేందర్‌రెడ్డి నిత్యం ట్రాఫిక్ సమస్య ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు విస్తరణ చేయడానికి గాను అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రాంతంలోని ఇండ్లను ఖాళీ చేసేలా వారిని ఒప్పించి, వారికి బోడుప్పల్ బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఇండ్లు కట్టుకోవడానికి అప్పటి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, ఎంపీటీసీలందరి సహకారంతో ఇండ్ల స్థలాలు కోల్పోయిన వారిని ఒప్పించి వారి పాత ఇండ్లను కూల్చివేసి రోడ్డు వెడల్పు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు మధ్యలో మరలా నెలకొల్పారు. అయితే అలా రోడ్డు వెడల్పులో ఇండ్లను కోల్పోయిన వారందరికీ అధికారులు చూపించిన చోట అందరూ నిర్మాణాలు చేసుకోగా, అందులో కొత్త రజిని అనే మహిళ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ఆలస్యంగా ఇంటి నిర్మాణం చేస్తుంది. అయితే ఆమెకు అండగా ఎవరూ లేరనే ఉద్దేశంతో ఆమె ఇంటిని అధికారులు పదే పదే నిలిపివేయడంతో పాటు గురువారం నాడు ఇంటిని కూల్చివేసేందుకు బందోబస్తు మధ్య అక్కడికి వెళ్ళిన అధికారులను మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్మీగౌడ్, కార్పొరేషన్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ అడ్డుకున్నారు. గత ఆరు సంవత్సరాల క్రితం బోడుప్పల్ నగర అభివృద్ధి కోసం అప్పటి కమిషనర్ ఒప్పించి రోడ్డు వెడల్పు పనుల కోసం అమే ఇంటిని కూల్చివేసి ఇక్కడ స్థలం చూపించారని, అయితే నేడు అధికారులు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ విధంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని ముడిపడ్డారు. ప్రజల తిరుగు బాటును గమనించిన అధికారులు అక్కడి నుండి కూల్చి వేయకుండానే వెళ్ళిపోయారు.
- నిర్మాణ దశలో ఎందుకు గుర్తించలేదు?
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత రెండు రోజులుగా కూల్చివేస్తున్న నిర్మాణాలు రాత్రికి రాత్రే చేపట్టిన నిర్మాణాలు కాదు గత ఆరు నెలల నుండి చేపడుతున్నవే అయితే వీటిని ఆదిలోనే గుర్తించి నిలువరించి ఉంటే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదని పలువురు నగరవాసులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న టీఎస్ బీ పాస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిస్థాయి లో విఫలం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. రోజూ నగరంలోనే తిరుగుతూ ఉండే నగర పాలక టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సెక్షన్ ఆఫీసర్స్‌కు వందల సంఖ్యలో చేపడుతున్న నిర్మాణాలను ఎందుకు కట్టడి చెయ్యలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఆదిలోనే ఈ నిర్మాణాలను నిలిపివేసి వారికి అనుమతులు ఇచ్చి ఉంటే ఇంతగా ఆస్తి నష్టం వాటిల్లేది కాదని వాపోతున్నారు.
- కొందరికి నోటీసులు, మరికొందరి నిర్మాణాలు కూల్చివేతలు
మున్సిపల్ చట్టం 2019 ప్రకారం అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఎలాంటి నోటీసులు లేకుండానే నిర్మాణాలను కూల్చివేయవచ్చు అనే నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ముఖం చూసి బొట్టు పెట్టే పద్ధతిలో వారికి నచ్చిన వారికి నోటీసులు, నచ్చకపోతే కూల్చివేతలు అనే రీతిలో వ్యవహరించడం జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు వారి డ్యూటీ కఠినంగా చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజలు అంటున్నారు. ఇంకో గమ్మత్తైన అంశం ఏంటంటే అక్రమ నిర్మాణాలపై వార్తలు రాసిన విలేకరుల పేర్లను సదరు నిర్మాణ దారులకు సమాచారం ఇచ్చి మీడియాపైకి ఉసిగొల్పడం వారికి పరిపాటిగా మారింది. టౌన్‌ప్లానింగ్ అధికారుల ప్రధాన ఉద్దేశం మీడియాను మున్సిపల్ కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా నిలువరించే వ్యూహంలో భాగమేనని చెప్పవచ్చు.
- మేయర్‌కు సమాచారమే లేదు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చేపడుతున్న కూల్చివేతల విషయంలో నగర ప్రథమ పౌరుడైన సామల బుచ్చిరెడ్డికి కనీస సమాచారం ఇవ్వలేదని వాపోయారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి తమ పాలకవర్గానికి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేం దుకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం జరుగుతుందని మేయర్ అన్నారు. కూల్చివేతలపై వివరణ అడిగేందుకు ప్రయత్నించగా టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించలేదు.