Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి.ప్రకాష్
నవతెలంగాణ-ధూల్‌పేట్
జల వనరుల అభివృద్ధే మానవాభివృద్ధి అని తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి.ప్రకాష్ అన్నారు. సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఆచార్య జయశంకర్ ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అవకాశాలు, సవాళ్లపై శాస్త్రీయ పరామర్శ' అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం కంటే జలమే విలువైనదన్నారు. జల సంరక్షణ దృష్టి లేకపోతే వచ్చే తరం మనల్ని క్షమించదని, నీటివనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవటంలో ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో తాగునీటి సమస్యలు ఎదురవుతాయని, ఈ దుస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం జలవనరులను అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. 46 వేల జలసంఘాలను నియమించి వాటి సేవల ద్వారానే నీటి వనరుల అభివృద్ధి సాధ్యమైందన్నారు. కార్యక్రమాల్లో ఎన్జీవో సంస్థలు, కళాశాలలు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొనాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐటీ రంగంలో చాలా ప్రగతి సాధించి, విస్తృతంగా ఉపాధి అవకాశాలను పెంచిందన్నారు. ప్రస్తుతం ఫార్మా రంగంలో చేస్తున్న కృషి ఫలితంగా భవిష్యత్తులో హైదరాబాద్, ప్రపంచానికే ఫార్మా క్యాపిటల్ కానున్నదని అన్నారు. తెలంగాణలో 60 శాతం సాగుభూమి పెరిగిందని, 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయితే, 2021లో తెలంగాణలో 240 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందన్నారు. ఇదే రాష్ట్రం సాధించిన ప్రగతి అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో, సిటీ కళాశాల నాయకుడిగా తనకు పునర్జన్మనిచ్చిందని గుర్తు చేసుకున్నారు.
స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రానీ మాట్లాడుతూ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అంతర్జాతీయ సంస్థలన్నీ నగరం వైపు చూస్తున్నాయని అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతున్నదని, రాష్ట్రాభివృద్ధికి ఇదొక మంచి సూచిక అని అన్నారు. టి.హబ్ ఒక వినూత్న ప్రయత్నమని ఆయన కొనియాడారు. వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.రఘునందన రావు 'తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం' అంశంపై మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం చాలా సంక్షోభంలో ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాక గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, వివిధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అధిక భూమి సాగులోకి వచ్చిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.బాలభాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ, వస్తూత్పత్తి, ఎగుమతి రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో జరుగుతున్న కృషి, ఎదురవుతున్న సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు విషయ నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. అనంతరం పరిశోధనా పత్రాలతో ముద్రించిన ప్రత్యేక సంచికను వి.ప్రకాష్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు డాక్టర్.జి.యాదగిరి, డాక్టర్.రాజేందర్ సింగ్, డాక్టర్.డి.టి.చారి, డాక్టర్. సౌందర్య, సురేశ్, ఆచార్య రేవతి, ఆచార్య విజరు, ఆచార్య డైసీ, డాక్టర్.బాల శ్రీనివాస్, డాక్టర్.గోపాల సుదర్శనం, డాక్టర్.వేణు ప్రసాద్, డాక్టర్.పావని, డాక్టర్.కృష్ణవేణి, లతారాణి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.