Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీర్జాదిగూడ మేయర్ అభ్యర్ధనతో 75 గజాల్లోపు నిర్మాణాలకు రూ.1కే అనుమతి
- టౌన్ ప్లానింగ్‌లో తగ్గిన అవినీతి... మున్సిపాల్టీలకు పెరిగిన ఆదాయం
- పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌కు గడిచిన మూడేండ్లలో రూ.33.35 కోట్ల ఆదాయం
నవతెలంగాణ-బోడుప్పల్
ఇంటి అనుమతుల జారీలో టీఎస్ బీపాస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు సత్ఫలితాలి స్తున్నాయి. గతంలో బ్రోకర్ల దగ్గర నుంచి మున్సిపల్ అధికారులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగితే తప్పా ఇంటి అనుమతులు వచ్చేవి కావు. కానీ నేడు టీఎస్ బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే జస్ట్ సింగిల్ స్టెప్స్‌లో నిర్మాణదారులకు ఇన్స్టాంట్ పద్ధతిలో ఇంటి అనుమతిని ప్రభుత్వం జారీ చేస్తుంది. రోజుల వ్యవధిలోనే దరఖాస్తులపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీం క్షేత్రస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రూవ్ చేస్తున్నారు. టీఎస్ బీపాస్‌లో సుమారు 30 రోజులలోపు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించనట్లైతే అధికారుల పాత్రలేకుండా నిర్మాణదారులకు డీమ్డ్ అప్రూవల్తో ఇంటి అనుమతులు జారీ కావడంతోపాటు స్పందించని అధికారులకు ప్రభుత్వం జరిమానా కూడా విధిస్తుంది.
పూర్తిగా ఆన్లైన్లోనే దరఖాస్తు మొదలుకొని అనుమతులను పొందే వరకు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే అత్యంత పారదర్శకంగా ప్రజలకు ఇంటి అనుమతులు మంజూరి అవుతున్నాయని, ఈ విధానం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పీర్జాదిగూడ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారి రాజీవ్‌రెడ్డి తెలిపారు. టీఎస్ బీపాస్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు 2,916 దరఖాస్తులు రాగా, వీటిలో ఇప్పటి వరకు 2,426 దరఖాస్తుదారులకు ఇంటి అనుమతులను జారీచేశామని ఆయన తెలిపారు. పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అభ్యర్థనపై స్పందించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2022 అక్టోబర్ 26వ తేదీన 75 గజాల్లోపు స్థలంలో ఇండ్ల నిర్మాణాలకు టీఎస్ బీపాస్్ ద్వారా కేవలం రూ.1కే ఇంటి అనుమతులను జారీ చేయాలని అధికారులను అదేశించడంతో పాటు ప్రత్యేకంగా ప్రభుత్వం ఓ సర్క్యలర్‌ను జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. టీఎస్ బీపాస్ ద్వారా దళారుల బెడదతోపాటు అవినీతి తగ్గిందని, అలాగే మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగిందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామకృష్ణరావు తెలిపారు. ఈ క్రమంలోనే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గడిచిన మూడేండ్లలో రూ.33.35 కోట్ల ఆదాయం సమకూరిందని కమిషనర్ తెలిపారు.
పారదర్శక సేవలు.. వెనువెంటనే అనుమతులు
జక్క వెంకట్ రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్
టీఎస్ బీపాస్ ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందడంతోపాటు వెనువెంటనే ఇన్‌స్టాంట్‌గా ఇంటి అనుమతులు జారీ అవుతున్నాయి. ఇంటి నిర్మాణ అనుమతుల జారీ విషయంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. టీఎస్ బీపాస్ సేవలు పూర్తిగా ఆన్లైన్లోనే పొందవచ్చు. టీఎస్ బీపాస్ మోబైల్ యాప్ కూడా ఉంది. నెట్ ఉంటే చాలు నట్టింట్లో నుండే ఇంటి అనుమతులను పొందే వెసులుబాటు టీఎస్‌బీపాస్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.