Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలపై దృష్టి సారించాలి
- రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ టీఎన్.వెంకటస్వామి
- ఘనంగా ఐఎస్ఓ విద్యాసంస్థల ఫ్రెషర్స్ డే
నవతెలంగాణ-ఓయూ
ఆధునిక ప్రపంచంలో విద్యా చాలా ముఖ్యమని రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ టీఎన్ వెంకటస్వామి అన్నారు. ప్రపంచం మొత్తం నూతన సాంకేతిక పరిజ్ఞానం వైపు పరిగెడుతుందని అందుకు అనుగుణంగా విద్యార్థులు కొత్త ఆలోచనపై దృష్టి సారించాలని సూచించారు. ఆదివారం తార్నాకలో జరిగిన ఐఎస్ఓ జూనియర్, డిగ్రీ కళాశాలాల విద్యాసంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన హాజరై ప్రసంగించారు. నేటి విద్యార్థులు చదువుకోవడానికి అనేక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ బాగా పెరిగిపోయిందని, ఏది కావాలన్నా క్షణాల్లో దొరికిపోతుందని అలాంటి టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు మొదటి మెట్టు పాఠశాల అని, అక్కడి నుంచే సరైన శిక్షణ లభిస్తుందని, కళాశాలకు వచ్చేసరికి విద్యార్థి దశ దిశ తనను తానే మార్చుకున్నప్పుడే ఉన్నత స్థాయిలో నిలబడతారని తెలిపారు. ఒకానొక సమయంలో వైఫల్యాలు విజయాలను ఎలా ఎదుర్కొవాలో అలానే ఓటమి ఎదురైన సమయంలో ఎలా ధైర్యంగా ఉండాలో విద్యార్థి దశలోనే నేర్చుకోగలుగుతారని చెప్పారు. ఐఎస్ఓ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ టి. వినోద వెంకటస్వామి మాట్లాడుతూ నేడు ఏ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఆ కోర్సులపైన దృష్టి పెట్టాలని కోరారు. అధ్యాపకులు ప్రొఫెసర్లు పాఠ్యాంశంలో ఉన్న విలువలను చెప్తారు కానీ ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి ఎదిగేది మాత్రం విద్యార్థులేనని అన్నారు. విద్యార్థులు పై చదువులకు ప్రమోట్ అయినప్పుడు నూతన విద్యార్థులకు కళాశాల వాతావరణం చదువు పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఫ్రెషర్స్ డే వేడుకలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా స్టేజ్ పెర్ఫార్మెన్స్తో పాటు అధ్యాపకులు తోటి విద్యార్థులతో సఖ్యత భావం ఏర్పడుతుందని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతోగానో ఆకట్టుకున్నాయి. నేడు విద్య ఎంత అవసరమో తెలిసే విధంగా విద్యార్థులు చేసిన స్క్రిప్ట్ ఎంతో ఆకట్టుకుంది. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో ఐఎస్ఓ విద్యాసంస్థల డీన్ మనోహర్, డిగ్రీ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ అశోక్, ప్రదీప, అడ్మిన్ స్టాఫ్ పద్మ, రాజశ్రీ, దివ్య, నవీన్, రంగస్వామి, అధ్యాపకులు, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.