Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో వెన్నెల సత్యం రచించిన 'నాన్న నానీలు' పుస్తకావిష్కరణ సభ ఎస్. రఘు అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎన్. గోపి మాట్లాడుతూ వెన్నెల సత్యం సామాజిక స్పృహ ఉన్న కవి అని, ఇప్పటికే అనేక ప్రక్రియల్లో బలమైన కవిత్వం రాస్తున్నారని కొనియాడారు. నాన్న నానీల్లో నాన్న ఔన్నత్యాన్ని శిఖరాయమానం చేసారన్నారు. అమ్మతో పోల్చితే నాన్న మీద కవిత్వం తక్కువే అని, అందులో నానీల్లో ఏకవస్తువు నాన్నగా నానీల సంకలనం తెచ్చిన తొలి కవి వెన్నెల సత్యం అని చెప్పారు. అమ్మానాన్నలు ఇద్దరి మీద నానీల సంపుటాలు తేవడం అభినందనీయమని అన్నారు. సభాధ్యక్షులు కవి, విమర్శకులు ఎస్. రఘు మాట్లాడుతూ నాన్ననానీలు నాణ్యతలో ముందువరుసలో నిలుస్తాయని అన్నారు. ఒక్కో నానీ ఆణిముత్యంలా మెరిసి నానీల ఘనతను నిలబెట్టాయని అన్నారు. మంచి భావుకతతో కూడి, పాఠకులు తాదాత్మ్యం చెందేలా ఉన్నాయన్నారు. నేటినిజం పత్రిక సంపాదకులు బైస దేవదాస్ మాట్లాడుతూ తెలుగుసాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వచ్చాయని, కొన్ని మాత్రమే నిలబడ్డాయని పాతికేళ్లయినా నానీల ప్రభ ఇప్పటికీ తగ్గడంలేదన్నారు. దక్షిణాఫ్రికా ప్రవాసకవి రాపోలు సీతారామరాజు మాట్లాడుతూ లుప్తమౌతున్న మానవీయ బంధాలను, నాన్న కోల్పోతున్న ఉనికిని అక్షరబద్దం చేసిన నానీలని అన్నారు. కార్యక్రమంలో కుడికాల వంశీధర్, ప్రముఖ విమర్శకులు తంగిరాల చక్రవర్తి, అనుముల ప్రభాకరా చారి, వెన్నెల సత్యం మాతృమూర్తి వడ్ల మోనమ్మ, వడ్ల రాజు, వడ్ల లక్ష్మి, తెలుగుపూలతోట అడ్మిన్లు డా. జయప్రకాశ్, మంజుల కులకర్ణి, సయ్యద్ ముజాహిద్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి, నర్సింహ, కోట్ల నర్సింలు, వడిచర్ల సత్యం, గాజుల పవన్ కుమార్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.