Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న బస్తీలలోని పేద ప్రజలకు అన్ని వసతులతో కూడిన విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హమాలీ బస్తీవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హులైన లబ్దిదారుల జాబితాను పరిశీలించేందుకు ఈనెల 30న హమాలీ బస్తీలో అధికారులు పర్యటిస్తారని చెప్పారు. ఆజాబితాలో అర్హులైన వారి పేర్లు లేకున్నా, అనర్హుల పేర్లు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హుల పేర్లు లేకుంటే తగు విచారణ జరిపి జాబితాలో పేరు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇరుకైన ఇండ్లలో రోడ్లు, డ్రయినేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు సక్రమంగా లేక ఇబ్బందిపడుతున్న అవస్థను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇస్తుందని అన్నారు. ఇప్పటికే బన్సీలాల్ పేటలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందని, లబ్దిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని వివరించారు. సమావేశంలో కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ, ఆర్డీఓ వసంత, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, బస్తీ అధ్యక్షుడు సుభాష్ తదితరులు పాల్గొన్నారు.