Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రకారం దేశంలో పుట్టిన వారంతా హిందువులయితే, దళిత క్రైస్తవ, ముస్లింలు కూడా ఆది హిందువులే అని, వారికి ఒక నీతి, అగ్రవర్ణ హిందువులకు ఒకనీతి ఎలా ఉంటుందని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా అండ్ తెలంగాణ విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం జేఏసీ కార్యాలయంలో జాతీయ సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో 'రాజ్యాంగం-రిజర్వేషన్లు, సామాజిక న్యాయం' అంశంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ క్రైస్తవులకు లేని మత నిబంధన దళిత క్రైస్తవ ముస్లింలకు మాత్రమే విధించడం వారి పట్ల వివక్షత కాదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా దళితుల మతం మారినంత మాత్రాన కులవివక్ష పోవడం లేదన్నారు. రిజర్వేషన్లు వర్తించవని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ దళితులకు వర్తించదా? ఇది కేంద్ర ప్రభుత్వ వివక్షత కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జాతీయ సోషల్ జస్టిస్ ఫోరం జాతీయ అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది గడిపే నాగయ్య, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.