Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-నాగోల్
తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి జంతు శ్మశాన వాటిక త్వరలో అందుబాటులోకి రానుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాగోల్ డివిజన్ పరిధిలోని ఫతుల్లా గూడలోని జంతు సంరక్షణ కేంద్రాని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీపుల్స్ ఫర్ అనిమల్ స్వచ్ఛంద సంస్థ వారు ముందుకు వచ్చి సుమారు రూ.కోటి వ్యయంతో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎంతో ప్రేమగా పెంచుకుని పోషించిన జంతువులు అనారోగ్యంతో చనిపోతే వాటిని ఎక్కడపడితే అక్కడ పార వేయకుండా ఈ జంతు సంరక్షణ కేంద్రంలో జంతువుల దహనం కోసం నూతనంగా దహన పరికరాలను ఏర్పాటు చేసి జంతు స్మశాన వాటికను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. ఎవరైనా జంతు ప్రేమికులు వారు పెంచి పోషించిన జంతువులు చనిపోతే ఈ శ్మశాన వాటిక వారికి సంప్రదిస్తే నామమాత్రపు చార్జీలతో అంతిమ సంస్కారాలు చేస్తారు. రోడ్లపై ప్రతినిత్యం వందల సంఖ్యలో జంతువులు చనిపోతున్నాయనీ, వాటిని ఎక్కడపడితే అక్కడ పారవేయడం వల్ల ఆ ప్రాంతమంతా దుర్గంధపరితమైన దుర్వాసనతో నిండిపోతుందని తెలిపారు. అలా కాకుండా వాటిని కూడా ఈ స్మశాన వాటికలో చేర్చి ఖననం చేయడం చేస్తామని తెలిపారు. జంతు సంరక్షణలతోపాటు స్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పీపుల్స్ ఫర్ అనిమల్ సంస్థ సభ్యులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి ,పీపుల్స్ ఫర్ అనిమల్ సంస్థ ఫౌండర్ అధ్యక్షులు వసంతి, కార్యదర్శి డాక్టర్ రమణారావు, సీఓఓ డాక్టర్ అమూల్య, ఇన్చార్జి శివ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.