Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు ముకుల్ వాస్నిక్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే బీసీలు ఓసీలు అవుతారా అని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు ముకుల్ వాస్నిక్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 బీసీ కుల సంఘాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ నేతృత్వంలో సమితి బృందం బుధవారం న్యూఢిల్లీలో ముకుల్ వాస్నిక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం పక్షపాతంతో రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 బీసీ కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అత్యంత వెనుక బడిన తరగతుల వారు అనేక దశాబ్దాల కిందట తెలంగాణ, హైదరాబాద్‌లో స్థిరపడ్డారన్నారు. వారిని తెలంగాణ బీసీల జాబితా నుంచి 26 బీసీ కులాలను తొలగించడం వల్ల ఈ కులాల విద్యార్థినీ, విద్యార్థులను మెడికల్, ఇంజినీరింగ్ ఇతర సంస్థలలో రిజర్వేషన్, ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం పొందలేకపోతున్నారని, యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కడం లేదని ఆయన వివరించారు. ముకుల్ వాస్నిక్ స్పందించి ఏపీకి చెందిన అట్టడుగు బీసీ కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుండి తొలిగించడం అన్యాయం అని అన్నారు. తొలగించిన కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆయా వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సమస్యను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని, 2022 డిసెంబర్లో జరిగే తదుపరి పార్లమెంట్ సమావేశాల్లోనూ, తక్షణ అవసరమైన చర్యల కోసం పార్టీ హైకమాండ్‌తో చర్చిస్తానని ముకుల్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ బీసీ నేత లక్ష్మీనారాయణ యాదవ్, అఖిల భారత ఓబీసీ విద్యార్ధి సంఘం నేతలు గౌడ కిరణ్ కుమార్, శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 బీసీ కుల సంఘాల పోరాట సమితి నేతలు శంబంగి రమేష్, అప్పు వీరన్న తదితరులు పాల్గొన్నారు.