Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ-ధూల్‌పేట్
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ అమానుష దాడులు ఆపాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ అన్నారు. పాలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చార్మినార్ గుల్జార్ హౌజ్ వద్ధ ఐప్సో, ఆవాజ్, కోవా, ఇన్సాఫ్ తదితర శాంతి సంఘాల ఆధ్వర్యంలో వందలాదిమంది శాంతి కాముకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు మేమంతా అండగా ఉన్నామన్నారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ బాంబులతో చేస్తున్న అమానుషకాండ ఆపాలని, అక్కడ శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని అమెరికా అమలు చేయాలని అన్నారు. పాలస్తీనా ప్రజలపై అమానుషంగా దశాబ్దాల తరబడి అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ దేశం చేస్తున్న దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన పోరాటానికి పాలస్తీనా విమోచన నాయకుడు యాసిర్ అరాఫత్ మద్దతు తెలిపారని, గాంధీజీ పాలస్తీనా ప్రజల పోరాటానికి మద్దతు తెలిపారన్నారు. 7 దశాబ్దాలుగా భారతదేశం అంతర్జాతీయ వేదికలపై పాలస్తీనా ప్రజల పోరాటానికి మద్దతు తెలుపుతూ వస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మన విదేశాంగ విధానం అమానుష ఇజ్రాయెల్ వైపు మారిందని తెలిపారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఇజ్రాయెల్ ప్రధానిని అతిథిగా ఆహ్వానించే స్థితికి చేరుకుందనీ, ఈ చర్యలు ఇజ్రాయెల్ లాంటి దురాక్రమణదారులకు మద్దతు ఇవ్వడం దారుణం అని విమర్శించారు. పాలస్తీనాను ఇజ్రాయెల్ బహిరంగ జైలుగా మార్చింది, పాఠశాలు, హాస్పిటల్స్‌పై కూడా ఇజ్రాయెల్ బాంబులు వేసి చిన్న పిల్లలను చంపడం అత్యంత దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో శాంతికాముకులు నినాదాలు, సంఘాల నాయకులు చేసిన సంక్షిప్త ప్రసంగాలు పర్యాటకులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో ఆవాజ్ సౌత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఎండీ.లతీఫ్, అబ్దుల్ సత్తార్, ఐప్సో రాష్ట్ర నాయకులు జి.రఘుపాల్, జి. నాగేశ్వర రావు, సౌత్ జిల్లా నాయకులు, పి.నాగేశ్వర్, జహంగీర్ సాగర్, మున్నా రజాక్, కోటయ్య, ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు అజీజ్ పాషా, కాంగ్రెస్, ఆమాద్మీ, టీఆర్ఎస్ అనుబంధ శాంతి సంఘాల నాయకులు యాదవ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.