Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కలకు నీళ్లు పోసే వారులేక ఎండిపోతున్న వైనం
- సంరక్షణకు బాధ్యత వీసీ రవీందర్ తీసుకోవాలని బహుజన విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అధికారుల అలసత్వంతో నీరుగారిపోతుంది. ఓయూలో నాటిన మొక్కలను చూసుకునే వారు లేక అవి ఎండిపోతున్నాయి. గతంలో హెచ్ఎండీఏ వారు మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకొని వాటిని పర్యవేక్షించేవారు. కానీ ప్రస్తుతం హెచ్ఎండీఏ వారు తప్పుకుని నాలుగు నెలలు అయ్యింది. దానితో వాటి రక్షణ ఓయూ అధికారులపై పడింది. వారు మొక్కల సంరక్షణ బాధ్యతను మరిచిపోవంతో అవి ఎండిపోవుటకు కారణమవుతున్నారు. ఇప్పటికైనా ఓయూ అధికారులు మేల్కొని హరితహారం మొక్కలను సంరక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బహుజన సంఘాల జాక్ చైర్మెన్ వేల్పుల సంజరు, ఓయూ జాక్ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
నీరుగారుతోన్న ఆశయం
ఓయూలో కరోనా సమయంలో కూడా హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట 10 చోట్ల 'మియవాకి' విధానంలో మొక్కలు నాటారు. వాటి సంరక్షణ కోసం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఉదయం, సాయంత్రం నిత్యం నీళ్లు పోసి, వాటి మధ్యలో పెరిగిన గడ్డిని, పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించారు. దీనిపై కమిషన్ అరవింద్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి ఓయూను ఒక దట్టమైన హరితవనంగా మార్చారు. దానిలో భాగంగానే ఇటీవలే రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ 'ఆక్సిజన్ పార్క్'ను ప్రారంభించారు. కానీ ప్రస్తుతం హెచ్ఎండీఏ వారు వెళ్లి పోవడం, పర్యవేక్షణ బాధ్యత చూసే నాధుడు లేక ఓయూలో నేడు మొక్కలు ఎండిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలనివిద్యార్థులు, అటు వాకర్స్, పర్యావరణ పరిరక్షణ నేతలు కోరుతున్నారు.