Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ పావని వినరు కుమార్
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్లో ఇండ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే ఊరుకోబోమని కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. శుక్రవారం డివిజన్లోని హుస్సేన్ సాగర్ నాలాపరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న అరుంధతి నగర్ బస్తీలో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనుల్లో ఇండ్లు కోల్పోతున్నామని స్థానికుల సమాచారంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడుతూ అరుంధతి నగర్, దోబీఘాట్ వాసులను ఇరిగేషన్ అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పడంతో స్థానికులు భయబాత్రులకు గురవుతున్నారని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాలా విస్తీర్ణ ప్రారంభోత్సవంలో గాంధీనగర్ డివిజన్ పరిధిలోని నాలా పరివాహక బస్తీ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా పనులు జరిపిస్తామని చెప్పారని, కానీ ఎలాంటి సూచన లేకుండానే ఖాళీ చేయమనడం, చిన్న ఇండ్లను సైతం తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఇండ్లకు ఎలాంటి హాని కలగకుండా రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేవైఎం నగర పూర్వ అధ్యక్షులు వినరు కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ ఉమేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.