Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి రాజకీయ దురంధరుడుగా, పరిపాలనా దక్షకుడిగా చెరగని ముద్ర వేశారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్క్‌లోని ఆయన స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమ సారధి, రెండుసార్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం గవర్నర్‌గా చేసిన గొప్ప నాయకులు మర్రి చెన్నారెడ్డి అని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చెన్నారెడ్డి వేసిన ముద్ర చెరగనిదని, రాజకీయ దురంధరుడుగా, పరిపాలన దక్షకుడిగా ఆయన వేసిన బాట అనితర సాధ్యమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనాన్ని చెన్నారెడ్డి వ్యతిరేకించారు అని తెలిపారు. తెలంగాణ ప్రజలు సాంఘిక, ఆర్థిక, విద్య రంగాల్లో వెనుకబడి ఉండటాన్ని చెన్నారెడ్డి సహించలేకపోయారని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సాగించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నిరంతరం కషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ, యువ నాయకులు వినరు కుమార్, అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ రమేష్ రామ్, సీనియర్ నాయకులు ప్రపుల్ రాంరెడ్డి, నాయకులు వెంకటేష్, మహేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద ఆరోహి బ్లడ్ బ్యాంక్, తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కోశాధికారి కె.సుదర్శన్ రెడ్డి తెలిపారు. హిమోగ్లోబిన్ లెక్కింపు లోపం వల్ల తలసేమియా బాధిత పిల్లలకు ప్రతి 2-3 వారాలకు రక్తం అవసరం అన్నారు. 1000 మంది పిల్లలకు రక్తదానం ద్వారా భరోసా ఇస్తున్నామని చెప్పారు. కొన్నేళ్లుగా ఇక్కడ 100 మంది దాతలు ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వసుధ దేవి, సుదర్శన్ రెడ్డి, నిర్వాణ, కావ్య, సావిత్రి, శశిధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జ్యోతి, హేమ, బ్లడ్ బ్యాంక్ సీనియర్ అధికారులు, వివిధ ఎన్జీఓల నుంచి అనేక మంది యువకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు పాల్గొన్నారు.