Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కరాటే రాజు నాయక్
నవతెలంగాణ-ఓయూ
ఉద్యమకారులైన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై అవాకులు చవాకులు పేలితే తెలంగాణ పొలిమేరల వరకు తన్నీతరుముతామని టీఆర్ఎస్ నేత కరాటే రాజు హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఓయు ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్న షర్మిల తన నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో తాము చూస్తూ ఊరుకోబోమని, తెలంగాణ పొలిమేరల వరకు తన్నితరుముతామని హెచ్చరించారు. తెలంగాణ జాతిపిత, సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావులపై షర్మిల నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు దేవుళ్లుగా భావించే వారిపై ఆమె వ్యాఖ్యలు సరికాదన్నారు. ఉద్యమంలో తన పాత్ర ఏమిటో ముందు చెప్పాలని సవాల్ చేశారు. షర్మిలపై విద్యార్థి ఉద్యమకారులు కన్నెర్ర చేయకముందే జాగ్రత్తపడాలని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ పొలిమేరల దాటే వరకు తన్ని తరమాల్సి వస్తుందని. హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రకరకాలుగా ఉద్యమాన్ని తెలంగాణను కించపరిచిన చరిత్ర వైఎస్ కుటుంబీకులదని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులకు తొత్తుగా మారి తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి నీవు ఎంతకు అమ్ముడు పోయావో ముందు చెప్పు అని కనీసం వార్డు మెంబెర్ కూడా లేని నీకు ప్రధాని మోడీ ఫోన్ చేయడం వెనుకాల కుట్ర ఏందో తెలంగాణ ప్రజలు గమనించారు అన్నారు. ముందుగా షర్మిల కనీసం వార్డు మెంబర్, సర్పంచ్‌గా గెలిచి తెలంగాణ ప్రజల తరపున మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతికత ఆమెకు లేదన్నారు. అమరవీరుల స్థూపాన్ని తాకి అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఆమె తక్షణమే ఉద్యమకారులైన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమెకు తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బదావత్ లక్ష్మణ్‌నాయక్, శ్రీనివాస్నయక్, రాజునాయక్, రమేశీ నాయర్, పాల్గొన్నారు.