Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ హరగోపాల్
- 'భారత రాజ్యాంగానికి సవాళ్లు' అంశంపై సమావేశం
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఆధునిక భారతదేశానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తండ్రి వంటి వారు అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ భవన్లో డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగానికి సవాళ్లు' అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక భారతదేశానికి తండ్రి వంటి వారిని, ఆయన ఆశయ సాధన కోసం కృషిచేసినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని కొనియాడారు. మత ఛాందసవాదం ముఖ్యంగా హిందూ ఫండమెంటలిజం రాజ్యాంగానికి పెనుముప్పు అని అన్నారు. దేశంలో సామ్రాజ్యవాద ఆర్థికాభివృద్ధి నమూనా అనుసరిస్తున్న నాటి నుంచి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం ఎక్కువైందని అన్నారు. రాజ్యాంగ విలువల విధ్వంసం జరుగుతోందని, ఫాసిజానికి చేరవ అవుతున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రమాదం మరింత పెరిగిందన్నారు. ప్రజలను విభజించడమే లక్ష్యంగా ఒకవైపు మతోన్మాదులు, సంపదను మరింతగా పెంచుకోవడానికి కార్పొరేట్లు రాజ్యాంగ సూత్రాలను మార్చాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీంతో ఒకప్పుడు రాజ్యాంగంలో ఉన్న లోపాలను సవరించాలని కోరే స్థాయి నుంచి ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రజలే పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికీ, ఇప్పటికీ వ్యవస్థలో ఆర్థికంగా అనేక మార్పులు వచ్చాయన్నారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోందని, న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి కోల్పోతోందని తెలిపారు. రాజ్యాంగాన్ని నిరాకరించిన వారే నేడు పాలకులుగా ఉండి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్య, అభ్యుదయ శక్తులు ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. కార్యక్రమంలో ఐఏఎస్ గోపాల్ రావు, ప్రొఫెసర్ నరసింహారెడ్డి, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నం, ప్రధాన కార్యదర్శి బాబురావు, పీతల అంబేద్కర్, రాజా, డాక్టర్ సుందర్ కుమార్ దాస్, డాక్టర్ సిద్దోజీ రావు, డాక్టర్ పద్మావతి, డాక్టర్ ప్రవీణ పాల్గొన్నారు.
రాజ్యాంగం లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది: ప్రొఫెసర్ కంచె.ఐలయ్య
ఓయూ: బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే...మనమంతా నియంతృత్వ పాలన అనుభవించేవారమని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందంటే అందుకు కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని స్పష్టం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఓయూలో 'అంబేద్కర్ నాడు-నేడు' అంశంపై అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్, యూజీసీ డీన్ కార్యాలయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు మతపరమైన, వామపక్ష, ఫాసిజం వంటి మూడు రూపాల్లోని నియంతృత్వ పాలనలో ఉండేవని వివరించారు. అంబేద్కర్ లేకపోతే నాలుగోతరహా నియంతృత్వంలోకి భారత్ వెళ్లేదని అన్నారు. అంబేద్కర్ వల్లే నేడు ఓయూలో పెద్దఎత్తున ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా పగ్గాలు దక్కాయని అన్నారు. అంబేద్కర్, ఫూలే, పెరియార్ల రచనలను ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రత్యేకంగా చర్చా కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రొఫెసర్లు అడపా సత్యనారాయణ, ముసలయ్య తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొ. పి.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ కొండ.నాగేశ్వరరావు, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, మైనారిటీ సెల్ డైరెక్టర్ డాక్టర్ సయ్యెదా అజీమ్ ఉన్నీసా, సహా ఆయా విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.