Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాష
- 58 జీవో జాప్యం ఎందుకు
- ఇండ్ల పట్టాలు ఇవ్వకుంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం
నవతెలంగాణ-ఉప్పల్
పేద ప్రజలకు గూడు నిర్మించే వరకు ఎర్రజెండా పోరాటాలు ఆగవని పేద ప్రజల ఎజెండానే ఎర్రజెండా ఎజెండా అని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా అన్నారు. గురువారం నాగోల్ పరిధిలోని సర్వేనెంబర్ 96/1 సాయినగర్ గుడిసెలలో నివాస ముంటున్న 650 కుటుంబాలకు ఇండ్లపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్ తహసీిల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ మండల పరిధిలోని సాయినగర్ గుడిసెల్లో నివాసముంటున్న 650 కుటుంబాలు అనేక కష్టనష్టాలను ఓర్చుకుంటూ గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని, వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 58 కింద ఇప్పటికే రెండుసార్లు గుడిసెవాసులు దరఖాస్తు చేసుకున్నారని, అయినా వారికి పట్టాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో హైదరాబాదులో అనేక బస్తీలు నిలబడ్డాయి అన్నారు. సాయినగర్ గుడిసెవాసులకు ఇండ్ల పట్టాలు వచ్చేవరకు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు అనేకమార్లు ధర్నా రూపంలో మెమోరాండం రూపంలో ఇవ్వడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో పట్టాలు ఇవ్వకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. రెక్కాడితే గాని డొక్కనిండని బడుగు, బలహీన వర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారని, అలాంటి వారికి పట్టాలివ్వకుండా జాప్యం చేయడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణం స్పందించాలని, పేద ప్రజలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కె.చందు, మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఫైమీదలు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని ఇండ్ల పట్టాలిచ్చి, ఇంటి నిర్మాణానికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. సాయినగర్‌లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. అర్హులను గుర్తించి జాబితా ప్రకటించాలన్నారు. సర్వేనెంబర్ 96/1 పై ఉన్న కేసును తొలగించాలని అధికారులను అడిగారు. ఈ సందర్భంగా ఉప్పల్ డిప్యూటీ తహసీల్దారు రఫీ మెమోరాండం ఇవ్వగా, వారు స్పందిస్తూ సర్వేనెంబర్ 96/1 పైన ఉన్న కేసులు తొలగిపోయాయని, 58 జీవో కింద దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ సర్వే నిర్వహించామని, సర్వే కాపీని ఆర్డీఓకి పంపించామని, ఆర్డ్డీఓ నుండి అనుమతి రాగానే అందరికీ పట్టాలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ శాఖ కార్యదర్శి పాషా, యాదయ్య, సహిదా బేగం, శ్రీనివాస్, పద్మ, రాయుడు, రాములు, ప్రమీల, కమిలి, అచ్చాలి, నాని, జహంగీర్, మహేందర్,సేవ్య, ధనమ్మ, కృపావరం, అంజమ్మ, చరణ్, బిజాన్, హేమలత, పద్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.