Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- తార్నాకలో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-ఓయూ
గ్రంథాలయాలకు పూర్వ వైభవం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వాతంత్య్రానంతరం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా గ్రంథాలయాలపై దృష్టి కేంద్రీకరించలేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం గ్రంథాలయాలను అన్ని రకాలుగా ఆధునికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించారు. తార్నాక డివిజన్ కింతీ కాలనీలోని బతుకమ్మకుంటలో గురువారం గ్రంథాలయ భవన నిర్మాణానికి హోం మంత్రి మహమూద్ ఆలీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలో మొత్తం 82 గ్రంథాలయాలు ఉన్నాయని, అన్నింటినీ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. భవనాలు లేని శాఖలకు నూతన భవనాలు నిర్మించడంతో పాటు ఇప్పటికే ఉన్న భవనాలను సైతం మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు గ్రంథాలయాల్లో కూర్చొని చదువుకున్న వారు నేడు అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. గ్రంథాలయాల్లో కూర్చుంటే యువత, వయోవృద్ధులు మానసిక ప్రశాంతత పొందుతారని చెప్పారు. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు డబ్బులు కట్టి ప్రయివేటు గ్రంథాలయాల్లో చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకల సదుపాయాలతో ప్రభుత్వ గ్రంథాలయాలను రూపొందిస్తున్నామని, ఇప్పటికే 14 గ్రంథాలయ భవనాలు మంజూరయ్యాయని, వాటిలో కొన్ని పూర్తయ్యే దశకు వచ్చాయని వివరించారు. బతుకమ్మకుంట గ్రంథాలయ భవనాన్ని రూ.84 లక్షలతో నిర్మిస్తున్నామని, సంవత్సరంలోగా దానిని ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అవసరమైతే గ్రంథాలయ సమయాలు సైతం పొడగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ డబ్ల్యూఐడీసీ) చైర్మెన్ రావుల శ్రీధర్ రెడ్డి, తెలంగాణ గ్రంథాలయాల సంస్థ చైర్మెన్ అయాచితం శ్రీధర్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, తార్నాక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.