Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయాలని రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బషీర్ బాగ్ లోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 24 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 12 వేలు, ఎయిడెడ్ పాఠశాలల్లో 4,900 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో 2,000, కస్తూర్బా పాఠశాలల్లో 1,200, ప్రభుత్వ పాఠశాలల్లో 4 వేల కంప్యూటర్ టీచర్ పోస్టులు, 10 వేల పిఈటి పోస్టులు, 5 వేల ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్ పోస్టులు, 3 వేల లైబ్రేరియన్ పోస్టులు, 4 వేల జూనియర్ అస ిస్టెంట్ పోస్టులు, 10 వేల అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఇవన్నీ భర్తీ చేయకుండా విద్యార్థుల భవిష్యత్, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలనీ, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ మాట్లాడుతూ సర్కార్ విద్యను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తుందన్నాఉ. పేద కులాలకు గొర్రెలు, బర్రెలు, పందులు, చేపలు కాదని చదువు కావాలన్నారు. రాష్ట్రంలో 7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల బీఈడీ, డీఈడీ చేసిన అభ్యర్థులు ఖాళీగా ఉన్నారనీ, వీరందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు రాష్ట్ర ప్రజలను ఫీజుల పేరుతో దోచుకుంటూ అప్పుల పాలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నేతలు అనంతయ్య, రాజ్ కుమార్, భాస్కర్, పలు జిల్లాల నిరుద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.