Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
సామాజిక చైతన్యానికి వేమన పద్యాలు అని డా.హిప్నో పద్మా కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. జనవరి 19న వేమన జయంతిని పురస్కరించుకుని గురువారం మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఆధ్వర్యంలో వేమన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగగా ఆమె మాట్లాడుతూ ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట వేసినది వేమన అన్నారు. సమాజ స్థితిగతుల పట్ల, మూఢాచార భావాలకు, తిరుగుబాటుతనానికి ఓ రూపాన్ని ఇచ్చింది యోగి వేమనని చెప్పారు. ఆయన జాతికి నూతన వ్యక్తిత్వాన్ని ప్రసాదించిన సాధకుడు, బోధకుడు అని తెలిపారు. తెలుగు భాషకు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టిన సుప్రసిద్ధ కవి అని చెప్పారు. విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన అన్నారు. యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారని చెప్పారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పిన వ్యక్తి వేమన న్నారు. విశ్వదాభిరామ వినుర వేమ' అనే మాట వినని తెలుగువారు ఉండరన్నారు. విద్యార్థులు వేమన పద్యాలు నేర్చుకుంటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. లయన్ ఉపాధ్యక్షురాలు జి.కృష్ణవేణి మాట్లాడుతూ వేమన జీవితమే గొప్ప గుణపాఠమన్నారు. రక్తిమార్గంలో పడి ఐహిక భోగాల్లో మునిగితేలిన ఆయన జీవితం.. మలుపు తిరిగి విరక్తి బాట పట్టిందంటే, దానికి కారణం.. గుణపాఠమేనన్నారు. ఎలా బతకాలో, ఎలా బతకకోడదో ఆయన జీవితమే తెలియజేస్తుందన్నారు. నర్సు సునీత మాట్లాడుతూ విన్నది విన్నట్లుగా, కన్నది కన్నట్లుగా కొట్టినట్లు వేమన చెప్పుకొంటూ పోయినా- ఆ పలుకుల్లోని నిర్మొహమాటం, నిజాయతీ మనల్ని కట్టిపడేస్తాయని తెలిపారు. ప్రపంచంలో సహజ కవి' వేమన అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లి దండ్రులుతో వేమన పద్యాలు చెప్పించారు. ఈ కార్యక్రమంలో లయన్ ఉపాధ్యక్షురాలు జి.కృష్ణవేణి, డా.పి.స్వరూపా రాణి పాల్గొన్నారు.