Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు సమాన పనికి...సమాన వేతనం ఎక్కడా?
- క్షతగాత్రులకు, మరణించిన వారికి అందని ప్రభుత్వ సాయం
- కార్మికుల పోరాటం కోసం అండగా సీఐటీయూ
నవతెలంగాణ-హయత్‌నగర్
ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి వీధులు, రోడ్లపై చెత్త చెదారం లేకుండా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనిలో నిమగమయి రోడ్లపై ఎవరు ఉమ్మినా, తుమ్మినా, దగ్గినా, కక్కినా ఎలాంటి మొహమాటం లేకుండా వాటిని సైతం శుభ్రం చేసే వారే పారిశుధ్య కార్మికులు. వారు చేసే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన కూడా ప్రస్తుతం వారికి రూ.14,250 మాత్రమే చెల్లిస్తుంది జీహెచ్ఎంసీ. అందులో పనిచేసే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిబంధనలు ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు వర్ణనాతీతం అని కార్మిక సంఘాలు నేతలు ఆవేదన చెందుతున్నారు. చూడాలి మరి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అయిన జీహెచ్ఎంసీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుకుందాం.
ప్రజారోగ్యంపై దృష్టి పెట్టే వారికి ఏది రక్షా?
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉన్న 3 సర్కిల్స్‌లో వందల సంఖ్యలో జీహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారు. ప్రతి ఏటా నియోజకవర్గ పరిధిలో రోడ్లు శుభ్రం చేస్తున్న సమయంలో రోడ్ ప్రమాదాలకు గురైన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందడం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు గాను కార్మికులకు అండగా మేం ఉన్నామంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో నేడు జోనల్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నాకు కార్మికులు ఐక్యం గా సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్మికుల డిమాండ్స్
ప్రమాదంలో గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ప్రమాదానికి గురైన కార్మికులకు వైద్యానికి అయ్యే ఖర్చును జీహెచ్ఎంసీ చెల్లించాలి. ప్రతీ కార్మికుడికి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించాలి. అర్హులైన కార్మికులకు డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలి. జీహెచ్ఎంసీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి. ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. పారిశుధ్య కార్మికుల సేవలో ప్రయివేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలి. రాంకీ తదితర ప్రయివేటు ఇంజినీరింగ్ కంపెనీలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
కార్మికుల సమస్యలపై పోరాటం ఆగదు
కార్మికుల సమస్యలపై పోరాటం చేయడానికి వెనుకాడం. నిరంతరం రోడ్లు శుభ్రం చేస్తున్న వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉండాలి. లేని పక్షంలో పెద్దఎత్తున ప్రధాన కార్యాలయంలో ధర్నా చేపడతాం.
-ఆలేటి ఎల్లయ్య, జీహెచ్ఎంసీ కార్మిక సంఘం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు.