Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
నవతెలంగాణ-అంబర్పేట
దేశంలో పేదల కోసం ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలు కంటి చూపు సంబంధిత సమస్యలకతో బాధపడ కూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం 'కంటి వెలుగు' కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని బాగ్ అంబర్ పేట డివిజన్ రామకృష్ణానగర్ పార్కులో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని భోలక్పూర్ డివిజన్ తాళ్లబస్తీ కమిటీ హాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి కంటి వెలుగు శిబిరాలను సందర్శించారు. ముషీరాబాద్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలు సుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అన్నారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, కండ్ల అద్దాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు. పేద ప్రజలు కంటి పరీక్షలు, ఆపరేషన్ల కోసం ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం కేసీఆర్ పేద, మద్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారని చెప్పారు. ఈ కంటి వెలుగు కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోనే తయారు చేసిన సుమారు 55 లక్షల కండ్ల అద్దాలను పంపిణీ చేయనున్నట్టు వివరించారు. అన్ని కాలనీలు, బస్తీల్లోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరా ల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంటి పరీక్షలు నిర్వహించాలని ''కంటి వెలుగు శిబిరం డాక్టర్లను సిబ్బందిని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, తహసీల్దార్ లలిత, సీనియర్ నాయకులు మోర శ్రీరాములు ముదిరాజ్, చందు, రమేష్ నాయక్, వెంకట్, శివాజీ యాదవ్, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.