Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఎం హౌం పూర్వ విద్యార్థుల సంఘం డిమాండ్
నవ తెలంగాణ- సరూర్ నగర్
విద్యార్థి అనుమానాస్పద మృతిపై పూర్తి విచారణ జరపాలని సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్, వీఎం హౌం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు భీమగాని మహేశ్వర్లు డిమాండ్ చేశారు. వీఎం హౌమ్లో పదో తరగతి చదువుతున్న అనాధ విద్యార్థి రాతులావత్ హరినాయక్ శనివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. నల్లగొండ జిల్లా ముదిగొండ గ్రామం మటిక తండాకు చెందిన హరినాయక్ తల్లిదండ్రులు గోపాల్, శాంతిలు పదేండ్ల క్రితమే చనిపోయారు. సోదరుడు భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హరి నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో సోదరుడు, బంధువులు హౌమ్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, సరూర్ నగర్ తహశీల్దార్ జయశ్రీ, హౌమ్ సెక్రటరీ అఖిలేష్ రెడ్డి, హౌమ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రభుదాసు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఐదు లక్షల పరిహారం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారు. అనంతరం కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ మాట్లాడుతూ వీఎం హౌంలో సెక్యూరిటీ సిబ్బందిని పెంచడంతోపాటు పిల్లల మానసిక నిపుణులను నియమించాలని తాము పలుమార్లు కోరినా వీఎం హౌం సిబ్బంది పట్టించుకోలేదన్నారు. వీఎం హౌం విద్యార్థి హరి నాయక్ మృతిపై పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన హరినాయక్ కుటుంబ సభ్యులను కలిసి వారి నిరసనకు సంఘీభావం ప్రకటించారు.