Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ౖ'మన ఊరు- మన బడి' కార్యక్రమం కేవలం ఫొటోలకే పరిమితమైందని ప్రభుత్వ పాఠశాల పనితీరు మెరుగవ్వడంలో వెనకప డిపోయిందని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆరోపించారు. శుక్రవారం హయత్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలను స్థానిక కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డితో కలిసి సందర్శించి రూ.70 లక్షల నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నాలుగేండ్ల క్రితం శంకుస్థాపన చేసిన రాయికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ తరగతి గదులు లేక పిల్లలు చెట్ల కిందనే విద్యను అభ్యసించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేవలం మాటలతో ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల కోసం ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్య కేవలం మ్యానిఫెస్టోలకే పరిమితమైం దన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఒక్కసారి కూడా వచ్చి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీఈవో ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి వెంట రంగారెడ్డి జిల్లా మహిళ అధ్యక్షురాలు నాగవాణి, బండారి భాస్కర్, నాంపల్లి రామేశ్వర్, గంగని శ్రీను తదితరులు పాల్గొన్నారు.