Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో చేపట్టబోతున్న ఉపాధ్యాయ పదోన్నతులలో భాషా పండితులకు స్థానం కల్పించకపోవడం చాలా అన్యాయమని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె.ఇశ్రాయేలు, కార్యదర్శి మహమ్మద్ అయూబ్ నిరసన వ్యక్తం చేశారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గ్రేడ్ 2 భాషా పండితుల పోస్టులను ఉన్నతీకరించకుండా ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తుందన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచ తెలుగు మహాసభలలో పండితుల పోస్టులను ఉన్నతీకరిస్తామని హామీ ఇచ్చి జీవో కూడా విడుదల చేసినప్పటికీ నేటికీ భాషా పండితుల పోస్టులు ఉన్నతీకరణకు నోచుకోలేదన్నారు. అందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర పండిత ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఐక్య వేదిక పిలుపునందుకొని హైదరాబాద్ జిల్లాలోని భాషా పండితులందరూ 9,10 తరగతులకు బోధించడం బహిష్కరించారని తెలియజేశారు. దాదాపు రెండున్నర దశాబ్దాల నుండి పదోన్నతుల కోసం ఆశతో ఎదురుచూస్తున్న భాషా పండితులకు పదోన్నతులు ఇచ్చి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.