Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ పురస్కార ప్రదాన సభలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నవతెలంగాణ-ధూల్‌పేట్
సమకాలీన సామాజిక పరిస్థితులలో మగ్దూం సాహిత్య స్ఫూర్తిని మరింత విస్త్రతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ కవి, శాసనమండలి అభ్యులు గోరటి వెంకన్న అన్నారు. సిటీ కాలేజీ పూర్వ అధ్యాపకులైన మగ్దూం పేరు జాతీయ పుర స్కారాన్ని ఉత్తమ సాహితీ వేత్తలకు 2019 నుంచి ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారాన్ని 2022 సంవత్సరా నికిగాను కవి జయరాజుకు, 2023 సంవత్సరానికి గాను ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కె.శ్రీనివాస్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మగ్దూం తాత్విక చైతన్యాన్ని తమ రచనల ద్వారా చాటి చెప్తున్న కె.శ్రీనివాస్, జయరాజులకు ఈ పురస్కారం ఇవ్వటం అత్యంత సముచితమైన నిర్ణయమని కొనియాడారు. నార్ల వేంకటేశ్వర రావు, ముట్నూరి కృష్ణారావు తర్వాత అంత నిజాయితీ, నిబద్ధతతో ప్రజాస్వామ్య భావజాలానికి ప్రాణం పోస్తున్న ఏకైక సంపాదకులు శ్రీనివాస్ అన్నారు. ప్రకృతి తత్వాన్ని, అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని జయరాజు తన పాటల్లో కవిత్వీకరించాడని చెప్పారు. ప్రజావాగ్గేయకారుల్లో జయరాజు శైలి విశిష్టమైనదన్నారు. మగ్దూం, పోతులూరి వీరబ్రహ్మం, రమణ మహర్షి, వేమన తదితర తత్త్వకవుల రచనలను అధ్యయనం చేస్తే విద్యార్థుల్లో సంపూర్ణమైన మూర్తిమత్వం వికసిస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను తాకట్టుపెట్టి తద్వారా సంపాదన సమకూర్చుకోవటం పాలకులకు మంచిది కాదన్నారు. మీడియా అకాడెమీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ కవిగా, నాటక కర్తగా, అధ్యాపకుడిగా, అనువాదకుడిగా, కార్మికోద్యమ నాయకుడిగా ఆనాటి తెలంగాణ సమాజంపై మగ్దూం చూపిన ప్రభావానికి నేటికీ ప్రాసంగికత ఉన్నదన్నారు. వర్తమాన పరిస్థితులలో అతని మార్గం అనుసరణీయ మన్నారు. తెలంగాణ సాహిత్య పరిణామ క్రమాన్ని తన పరిశోధన గ్రంథంలో శ్రీనివాస్ అద్భుతంగా విశ్లేషించారనీ, ఎంత గొప్ప సంపాదకుడో, అంత గొప్ప సాహితీ వేత్త అని అభినందించారు. వాగ్గేయకారుడిగా ఉద్యమాలలో జయరాజు నిర్వహించిన పాత్ర కీలకమైనదనీ, సమర్ధులైన వీరిద్దరికీ మగ్దూం జాతీయ పురస్కారం ప్రదానం చేయడం ఆదర్శనీయమన్నారు. ప్రముఖ కవి యాకూబ్ మాట్లాడు తూ స్వేచ్చ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం గురించి మగ్దూం చూపిన బాటలో ఇవ్వాళ అందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. పురస్కారాన్ని అందిస్తున్న నిర్వాహకులు, అవార్డు గ్రహీతలు, సిటీ కళాశాల విద్యార్థులు మగ్దూం తాత్విక వారసత్వాన్ని కొనసాగించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన అవార్డు కమిటీ ఛైర్మన్, కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్.పి.బాల భాస్కర్ మాట్లాడుతూ మగ్దూం సాహి త్య వ్యక్తిత్వాన్ని, ఉద్యమ కృషిని, అధ్యాపకుడిగా మగ్దూం ప్రబోధించిన జ్ఞానతత్వాన్ని ఈ తరానికి అందజేయాలన్నా రు. అతని పేరిట ప్రతి ఏడాదీ ఈ జాతీయ పురస్కారం అందిస్తున్నామనీ, రాష్ట్రంలో మరే కళాశాల ఇలాంటి పుర స్కారం అందించటం లేదన్నారు. అవార్డు కమిటీ ఆధ్వ ర్యంలో గోరటి వెంకన్న, అల్లం నారాయణ, డాక్టర్.బాల భాస్కర్, యాకూబ్ చేతుల మీదుగా కె.శ్రీనివాస్, జయ రాజులకు సిటీ కాలేజ్ మగ్దూం మొహియుద్దీన్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. రూ.10వేల నగదు, జ్ఞాపిక, దృవపత్రం, శాలువాతో గ్రహీతలను సత్కరించా రు. సన్మాన గ్రహీతలు ప్రతిస్పందిస్తూ ఎన్ని అవార్డులు అందుకున్నప్పటికీ మగ్దూం పేరిట సిటీ కాలేజీ ఇచ్చిన అవార్డు ఎంతో ప్రత్యేకమన్నారు. మగ్దూం పట్ల ఉన్న అభి మానం, సిటీ కాలేజీ పట్ల గౌరవం ఇందుకు కారణ మన్నారు. ఈ కార్యక్రమాన్ని అవార్డు కమిటీ కన్వీనర్ డాక్టర్.విప్లవ్ దత్ శుక్లా, సభ్యులు డాక్టర్.యాదయ్య, డాక్టర్.రత్న ప్రభాకర్, డాక్టర్.కోయి కోటేశ్వర రావులు సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ వెల్చాల కొండలరావు, మగ్దూం కుమారుడు జాఫర్ మొహియుద్దీన్, కొండపల్లి పావన్, పాశం యాదగిరి, మెర్సి మార్గరెట్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.