Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది అనాథల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అనాథల హక్కుల సంస్థ అధ్యక్షులు బొక్క వెంకటయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో అనాథల కోసం ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ గురుకులాల ప్రారంభం, రిజర్వేషన్లు రాష్ట్ర ఉన్నత అధికారుల సమక్షంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనాథల సంక్షేమంపై నియమించబడ్డ మంత్రివర్గ ఉప సంఘం జనవరి 8, 2022న చేసిన సిఫారసులో ఏ ఒక్క హామీ అమలులోకి రాలేదన్నారు. తెలంగాణలోని అనాథలందరినీ చట్టపరంగా ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడం, కేజీ టూ పీజీ వరకు అనాథల ఉన్నత చదువుకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయడం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేని విధంగా అనాథ పిల్లలకు స్మార్ట్ కార్డులు ఇవ్వడం, అనాథలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించడం, అనాథ పిల్లల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై అలాగే అనాథలచే బిక్షాటన చేయించే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడంతో పాటు అనాథలను అవమానించే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా అనాథల అవమాన నిరోధక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. అనాథ పిల్లల శరణాలయలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి వసతులను కల్పించాలనీ, అనాథల సంక్షేమం కోసం ప్రతి ఏడాదీ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారికి కోసం ఖర్చు చేసే నిధులను గ్రీన్ ఛానల్లో పెట్టి మిగిలిపోయిన వాటిని మరుసటి ఏడాదికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సామాజిక బాధ్యతగా అనాథలను ఆదుకోవడానికి ముందుకొచ్చి సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి, మానవతామూర్తి మదర్ థెరిస్సా జన్మదినం రోజున ప్రతి ఏడాదీ వారిని గౌరవిస్తూ సామాజిక సేవా పురస్కారాలు అందించాలన్నారు. రాష్ట్రంలో 2015 నాటికి ఆరు లక్షల మంది అనాథలు ఉన్నారనీ, ప్రభుత్వం వద్ద సమాచారం కూడా ఉందనీ, ఈ 8 ఏండ్ల కాలంలో రెండు విడతలుగా వచ్చిన కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన మరెంతో మంది పెరిగారని గుర్తు చేశారు. ప్రస్తుతం అనాథలైన పిల్లలు తెలంగాణలో 10 లక్షల మంది వరకు ఉంటారని ఒక అంచనా ఉందనీ, వారందరినీ ప్రభుత్వ బిడ్డలుగా పరిగణలోకి తీసుకుని వారికి అన్ని విధాలుగా చేయూతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.