Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు తాము ఎప్పుడు చేపట్టబోమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన సనత్ నగర్ డివిజన్లోని జెక్ కాలనీలో చేపట్టిన ఆర్చి నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కొందరు ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టవద్దని మంత్రిని కోరారు. దాంతో స్పందించిన మంత్రి తమకు అలాంటి ఆలోచన లేదని, రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఉన్న పుట్ పాత్ను మాత్రమే తొలగించి నూతనంగా నిర్మిస్తున్న ఆర్చి నుంచి హనుమాన్ దేవాలయం వరకు నూతన వీడీసీసీ రోడ్డును నిర్మించడం జరుగుతుందని వివరించారు. తాను సనత్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాతనే ఈ ప్రాంతం ఎవరూ ఊహించని విధంగా ఎంతో అభివద్ధి చెందిందని, అనేక పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించినట్టు వివరించారు. జెక్ కాలనీ వాసులకు తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నానని చెప్పారు. సబ్ స్టేషన్ వద్ద రోడ్డు విస్తరణ, స్ట్రీట్ నెంబర్ 1లో రోడ్డు నిర్మాణం, పార్క్ అభివద్ధి వంటి పలు పనులు పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, జెక్ కాలనీ అద్యక్షులు సూర్య శంకర్ రెడ్డి, రాఘవయ్య, సురేష్ గౌడ్, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిర, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్ తదితరులు ఉన్నారు.