Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ చీఫ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ రేణుకయారా పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్యాన్సర్‌పై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో క్యాన్సర్‌ను గుర్తించి, క్యాన్సర్‌ను జయించవచ్చని సిటీ సివిల్ కోర్ట్ చీఫ్ జడ్జి, హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ రేణుకయారా అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పురాణ హవేలీలోని సిటీ సివిల్ కోర్టులో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జడ్జ్జి రేణుకయారా మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం గుండె ధైర్యంతో ఎదుర్కోవాలని అన్నారు. తొలుత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ క్యాన్సర్ బాధితుల కోసం, ఎంఎన్‌జే క్యాన్సర్ వైద్యశాల బ్లడ్ బ్యాంక్ కోసం రక్తదాన శిబిరాన్ని న్యాయమూర్తి రేణుకయారా ప్రారంభించారు. రక్తదాన శిబిరం అనంతరం న్యాయమూర్తులకు, న్యాయశాఖ సిబ్బంది, మహిళలకు ఏర్పాటుచేసిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో అపోలో వైద్యశాల సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజేష్ రాజ్ సక్సేన, డాక్టర్ మాధురి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ లక్ష్మి తదితరులు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ద్వారా వైద్యులు, క్యాన్సర్ రావడానికి గల కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తించే విధానాలు వివరించారు. పొగాకు ఉత్పత్తులకు ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండాలని, తాజా కూరగాయలను తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాలను అవలంబించాలని సూచించారు. 21 సంవత్సరాలు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవడం తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించడానికి ఉపయోగపడుతుందని, తద్వారా సకాలంలో తగిన చికిత్స పొంది క్యాన్సర్ నుండి విముక్తి పొంద గలరని అన్నారు. మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని, ఒకవేళ క్యాన్సర్ బారినపడ్డా తగు చికిత్సతో ధైర్యంతో క్యాన్సర్‌ను జయించవచ్చని డాక్టర్ అజరు సక్సేన వివరించారు. మహిళలు రొమ్ము క్యాన్సర్ స్వీయ పరీక్ష ద్వారా పరిశీలించుకునే విధానాలను డాక్టర్ మాధురి వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడికి ఆరోగ్యంగా జీవించే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని, ఆ హక్కు సక్రమంగా వినియోగించుకునేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ క్యాన్సర్ అవగాహన సదస్సులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో ప్రజలకు పేదలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుందని వివరించారు. కార్యక్రమంలో క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులను చీఫ్ జడ్జ్ రేణుక సన్మానించారు. రక్తదాన శిబిరంలో ఏఐపీఐఎఫ్ సంస్థ సభ్యులు నూరుద్దీన్, సిటీ సివిల్ కోర్టు న్యాయశాఖ సిబ్బంది, న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ సిబ్బంది , పారా లీగల్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.