Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20న మత్స్య సొసైటీ డైరెక్టర్ల రాష్ట్ర సదస్సు
- టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్య కారుల సంక్షేమం కోసం రూ.5000ల కోట్లు కేటాయించాలని 20న జరిగే సొసైటీ డైరెక్టర్ల రాష్ట్ర సదస్సులో తీర్మానం చేయనున్నామని తెలంగాణ మత్స్య కారులు, మత్స్య కార్మిక సంఘం( టీఎంకేఎంకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ అన్నారు. తెలంగాణ మత్స్య కారులు, మత్స్య కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ నగర కమిటీ విస్తృత కార్యకర్తల సమావేశం ఆదివారం వృత్తిదారుల భవన్ గోల్కొండ చౌరస్తాలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కోటి మంది ప్రజలకు, నగరానికి వచ్చే పర్యాటకులకు పోషక విలువలు కలిగిన చేపల వంటకాలు అందించడానికి ప్రతీ టూరిజం కేంద్రాలలో ఫిష్ ఫుడ్ కోర్ట్‌లను ఏర్పాటు చేయాలని, ప్రతీ కార్పొరేషన్ డివిజన్లో రిటైల్ చేపల మార్కెట్లు నిర్మించాలని, అలాగే మహానగరంలో నాలుగు వైపులా 10 ఎకరాల స్థలం కేటాయించి రూ. 100 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో హౌల్‌సేల్ చేపల మార్కెట్లను నిర్మించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మత్స్య సోసైటికి 10 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించేందుకు, వచ్చే బడ్జెట్ లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్య కారుల సంక్షేమం కోసం రూ.5000ల కోట్లు కేటాయించాలని, 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు రూ.5 వేల రూపాయలు పింఛను ఇవ్వాలని, ఇందుకోసం ఈనెల 20న జరిగే రాష్ట్ర సదస్సులో తీర్మానం చేయనున్నామని తెలిపారు. మత్స్య సొసైటీ అధ్యక్షులు/డైరెక్టర్ల రాష్ట్ర సదస్సుకు పెద్ద సంఖ్యలో అన్ని మత్స్య సొసైటీలు భాగస్వాములై జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ గుమ్మడిరాజు.నరేష్ పాల్గొని మాట్లాడారు.
సమావేశంలో 13 మందితోగ్రేటర్ హైదరాబాద్ నగర నూత న కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా కొప్పు పద్మ, ప్రధాన కార్యదర్శిగా ముఠా విజరు కుమార్, ఉపాధ్య క్షులు గా ముటా దశరథ్, గాండ్ల అమరావతి, సహాయ కార్యదర్శు లుగా చంద్రీ.పుష్ప, పూస నాగమణి, పంపరి మంజుల, కే విజయలక్ష్మి, కమిటీ సభ్యులుగా పూస.ప్రదీప్, గౌటి మధుసూధన్, కల్లూరి విమల, కల్చేటి.యాదగిరి, పి లక్ష్మమ్మ తదితరులు ఎన్నికయ్యారు.