Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవాస్తవాలతో ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నాలు
- ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ డి. సుధాకర్
- కేంద్రం చర్యలను నిరసిస్తూ.. ఈడీ ప్రతుల దహనానికి పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో, హిమాయత్‌నగర్
ప్రజల ఆదరణతో రాజకీయంగా ఎదుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భవిష్యత్తులో తమకు సవాలుగా మారుతుందన్న భయంతో మోడీ సర్కారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా నకిలీ కేసులు బనాయించి చార్జ్షీట్లను దాఖలు చేయించిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేజ్రీవాల్‌పై అవాస్తవాలతో ఈడి ఛార్జ్షీట్లను సృష్టించి, నకిలీ కేసులతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఫలించవన్నారు. సోమవారం లిబర్టీ సర్కిల్లోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు రాముగౌడ్, ప్రొఫెషనల్ టీమ్ కోఆర్డినేటర్ డాక్టర్ హరిచరణ్, అధికార ప్రతినిధి అబ్దుల్, హైదరాబాద్ ఇన్చార్జి మాజిద్, నల్లగొండ ఇన్చార్జి అఫ్జల్, అఫ్సా, టి.రాకేష్ సింగ్, మోమిన్, జావేద్‌లతో కలసి సుధాకర్ మాట్లాడారు. అవినీతిని నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేసి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్, విద్యపై దృష్టి పెట్టి ఆప్ పాలిత రాష్ట్రాల్లో సుపరిపాలన ప్రభుత్వాలను కొనసాగిస్తున్నారని, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఎవరూ ఆప్ నేతలు అవినీతికి పాల్పడే సమస్యేలేదని స్పష్టం చేశారు. ఆప్ నేతలను నకిలీ కేసులతో వేధిస్తే ఉరుకునేదిలేదని మోడీ సర్కారును హెచ్చరించారు.
ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో అన్ని రంగాలవారికి అన్యాయమే జరిగిందని, నిరాశే మిగిలిందని తెలిపారు. విద్యా రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేదని, యువతకు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు. బీసీల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం, బీసీ, ఎస్టీ మైనార్టీ బంధు లేదని, ఇది అంకెల గారడీ బడ్జెట్ అని విమర్శించారు. రాముగౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తే తిరుగుబాటు తప్పదని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆప్ నేతలపై ఈడీ నకిలీ కేసులను, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టాలనే బీజేపీ కుట్రలను నిరసిస్తూ మంగళవారం(నేడు) హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన కేంద్రాల్లో నిరసన పదర్శనలకు పిలుపు నిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు రమేష్ దర్శనమ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.