Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31వేల సర్టిఫికెట్లను రద్దుచేసిన జీహెచ్ఎంసీ
- విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశం
- ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డికి బాధ్యతలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో నకిలీ జనన, మరణ సర్టిఫికెట్ల జారీ, బయటికొస్తే వాటిని రద్దు చేయడం, నగర వాసులను ఇబ్బందులకు గురిచేయం పరిపాటిగా మారింది. జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని, సమూల మార్పులు చేస్తామని, కొత్త సాంకేతిక పరిజ్ఞా నంతో నగరవాసులకు సులభంగా సర్టిఫికెట్లను జారీచేయడానికి అవకాశముందని జీహెచ్ఎంసీ అధికారులు గొప్పలు చెప్పారు. కాని పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే జనన, మరణ సర్టిపికెట్లను తీసుకోవడం నగరవాసులకు భారంగా మారింది. కాసుల కక్కుర్తి కోసం అసలు పత్రాల్లేకుండా వేల సం ఖ్యలో సర్టిఫికెట్లు జారీ చేసిన ఘనత జీహెచ్ఎంసీకే దక్కుతుంది. గతంలో ఫేక్ సర్టిఫికెట్ల జారీలో జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే విదే శాలకు వెళ్లడానికి బర్త్ సర్టిఫికెట్లు, ఆస్తుల కోసం డెత్ సర్టిఫికెట్లను కొందరు అక్రమార్కులు అడ్డదారిలో పొందడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. కాని నిబంధనల ప్రకారం, ప్రభుత్వ నిబం ధనలను అనుసరించి సర్టిఫికెట్ తీసుకున్నవారూ ఉన్నారు. అయితే చెల్లని కాగితాలతో వేల సర్టిఫికెట్లు జారీ చేయటం, అక్రమం బట్ట బయలైన తర్వాత సక్రమంగా ఎవరు తీసుకున్నారు? అక్రమంగా ఎవరు తీసుకున్నారు? అనే విషయాలను పట్టించుకోకుండా అన్నింటిని రద్దు చేయటం పట్ల ప్రజల్లో ఆగ్రహాం వ్యక్తమవుతుంది. బాధ్యతాయుతమైన అధికారులే కాసుల కోసం ఇలా అడ్డదారిలో జనన, మరణ సర్టిఫికెట్లు జారీ చేయగా వాటిని రద్దు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించకపోతే, ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండ వ్యాపారాలు చేస్తే, చివరకు బతుకుదెరువు కోసం టులెట్ బోర్డులు పెట్టిన వాటిపై వేలాది రూపాయల జరిమానాలు విధిస్తున్నా.. 30వేల సర్టిఫికెట్లను రద్దు చేసిన జీహెచ్ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని జనం ప్రశ్నిస్తున్నారు.
నాన్ అవెలిబిటీ సర్టిఫికెట్ అంటే?
జీహెచ్ఎంసీ జారీ చేసే నాన్ అవెలబిలిటీ సర్టిఫికెట్ అంటే ఇంట్లో జన్మించిన వారికి బర్త్, మరణించినవారికి డెత్ సర్టిఫికెట్లకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో లేకపోయిన, ఏడాది తర్వాత తీసుకున్నవారికి నాన్ అవెలిబిలిటీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత రెవెన్యూ ఉన్నతాధికారుల వద్ద తమ స్టేట్ మెంట్‌ను రికార్డు చేయడంతోపాటు అధికారులు సర్టిఫైతో వార్త పత్రికల్లో ప్రకటన ఇచ్చి, అభ్యంతరాలను ఆహ్వానించి, ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే సర్కారును ఆశ్రయించి సదరు బర్త్, డెత్‌కు సంబంధించిన గెజిట్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత జనన, మరణాలపై అన్ని కోణాల్లో విచారించిన తర్వాత సర్కారు జారీ చేసే గెజిట్ సహాయంతో స్థానిక సంస్థ నుంచి అసలైన సర్టిఫికెట్ పొందవచ్చు. అయితే నామమాత్రపు వివరాలు ఇచ్చినా వేలాది రూపాయలు లంచాలు తీసుకుని సర్కిల్ స్థాయిల్లో నాన్ అవెలబిలిటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
31వేల సర్టిఫికెట్లు రద్దు
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో జారీచేసిన సర్టిఫికెట్లు సరైనవని కావని బహిర్గతమవడంతో 31వేల జనన, మరణ ధ్రువ పత్రాలను రద్దు చేశారు. జనవరి 2020 నుంచి 2022 డిసెంబర్ మధ్య 31వేల సర్టిఫికెట్లను జారీచేశారు. వీటిలో సుమారు 27వేల సర్టిఫికెట్లు ఫేక్ ఉన్నాయని, మరో 4వేల సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారమే జారీచేసినట్టు ప్రచారం జరుగుతుంది. అధికారులు రద్దు చేయడంతో నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు తీసుకున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ జారీచేసిన బర్త్ సర్టిఫికెట్తో ఇప్పటికే విదేశాలకెళ్లినవారి గోస వర్ణణాతీతం. చాలా మంది నగరంలో ఇండ్లలో పుట్టిన వారు సైతం విదేశాలకు వెళ్లాల్సి వస్తే తప్పా బర్త్ సర్టిఫికెట్లు తీసుకోకపోవడంతోపాటు ఏడాది తర్వాత కూడ మరింత కొంత మంది తీసుకోవడంలేదు.
విజిలెన్స్ విచారణ
గ్రేటర్‌లోని 31వేల జనన, మరణ ధ్రువపత్రాలను జీహెచ్ ఎంసీ రద్దు చేయడంపై విజిలెన్స్ విచారణకు కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ఎన్.ప్రకాశ్‌రెడ్డికి అప్పగించారు. విచారణ అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారా? లేదా? చూడాల్సిందే.